– డీఎంఈకి ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్, సర్జన్స్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అన్ని మెడికల్ కాలేజీల్లో డెంటల్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన బోధనా సిబ్బందిని నియమించాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్, సర్జన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ మంజూర్ అహ్మద్ నేతృత్వంలో మంగళవారం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకునికి వినతిపత్రం అందజేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల మేరకు ఈ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. బ్యాచ్‌కు 100 ఎంబీబీఎస్ సీట్లు కలిగిన ప్రతి మెడికల్ కాలేజీలో ఆ మార్గదర్శకాల మేరకు తప్పనిసరిగా ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక జూనియర్ రెసిడెంట్, నలుగురు డెంటల్ టెక్నీషియన్లు ఉండాలని తెలిపారు. బ్యాచ్ కు 250 ఎంబీబీఎస్ సీట్లు కలిగిన మెడికల్ కాలేజీలో అదే నిష్పత్తిలో బోధనా సిబ్బంది సంఖ్య పెంచాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 38 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయనీ, వాటన్నింటిలో గెజిట్ అయిన ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకు డెంటల్ యూనిట్ల పనిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం జాతీయ ప్రమాణాలను అందుకునేందుకే కాకుండా విద్యార్థులు అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ విద్యపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో డాక్టర్లు నోటి అనారోగ్య సమస్యలను గుర్తించి వెంటనే సిఫారసు చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో స్థానిక ప్రజలకు నోటి ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ద్వారా అందరికి సమాన ఆరోగ్యసేవల లక్ష్యం దిశగా అడుగులు పడతాయని చెప్పారు.