దేశ దిశ

మా బిడ్డ ఆత్మహత్యపై అనుమానాలున్నాయ్‌! | There are suspicions about our kid’s suicide!


ABN
, Publish Date – Apr 28 , 2025 | 01:17 AM

మదర్‌థెరీసా కళాశాల యాజమాన్యం

సమాధానం చెప్పాల్సిందేనన్న కుటుంబీకులు

మృతదేహాన్ని చేతులపై పెట్టుకుని

ఐదు కిలోమీటర్లు నడిచొచ్చి రోడ్డుపై ధర్నా

పోలీసుల జోక్యం, యాజమాన్యం హామీతో విరమణ

మా బిడ్డ ఆత్మహత్యపై అనుమానాలున్నాయ్‌!

మృతదేహాన్ని చేతులపై పెట్టుకుని కళాశాల వద్దకు నడిచి వస్తున్న బాధితులు

గంగవరం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘మా బిడ్డ యోగేష్‌ (16) ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి. మదర్‌థెరీసా కళాశాల యాజమాన్యం సమాధానం చెప్పాల్సిందే’ అని కుటుంబీకులు పట్టుబట్టారు. మృతదేహాన్ని చేతులపై పెట్టుకుని ఐదు కిలోమీటర్లు నడిచొచ్చి కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. చివరకు పోలీసుల జోక్యం, కళాశాల యాజమాన్యం ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాడన్న మనస్తాపంతో శాంతిపురం మండలం గెసికపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం, ప్రభ దంపతుల కుమారుడు యోగేష్‌.. గంగవరం మండలం మదనపల్లె రోడ్డులో ఉన్న మదర్‌ థెరీసా కళాశాల హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యోగేష్‌ మృతదేహానికి ఆదివారం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి, కుటుంబీకులకు అప్పగించారు. అయితే తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని, కళాశాల యాజమాన్యం నివృత్తి చేశాకే స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్తామని కుటుంబీకులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించడానికి అభ్యంతరం లేదని, కళాశాల వద్దకు తీసుకెళ్లొద్దని పోలీసులు చెప్పడంతో అంబులెన్స్‌ నిర్వాహకులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో బాధితులు.. మృతదేహాన్ని చేతులపైనే పెట్టుకుని పలమనేరు ప్రభుత్వాస్పత్రి నుంచి కళాశాల వరకు సుమారు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం 3.50 గంటల నుంచి కళాశాల ఎదుట రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి.. బంధువులతో కలిసి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. యోగేష్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. శనివారం ఉదయం ఫోన్‌ చేస్తే హాస్టల్‌లో లెమన్‌రై్‌స తిన్నానని, చదువుకుంటున్నానని చెప్పాడన్నారు. సాయంత్రం ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదని, కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోయాడని స్నేహితులు చెప్పగా కళాశాల వద్దకు వచ్చామన్నారు. ఇక్కడికొస్తే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో ఖంగుతిన్నామన్నారు. హాస్టల్‌ గదిలో ఉరేసుకుంటే యాజమాన్యం లేదా సిబ్బంది ఎందుకు సకాలంలో స్పందించలేదని మండిపడ్డారు. మేమొచ్చేలోపు ఎందుకు ఆస్పత్రికి తరలించారని, హాస్టల్‌లోని సీసీ కెమెరాలను చూపించాలని వేడుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. అందువల్ల తమ బిడ్డ మృతిపై అనుమానాలున్నాయని, కళాశాల యాజమాన్యం రోడ్డుపైకి వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదన్నారు. ఫీజు కట్టనిదే హాస్టల్‌లోనికి అనుమతించమని చెప్పిన యజమాన్యానికి తమ బిడ్డ ప్రాణాలను కాపాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ‘రోడ్డుపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. మీకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తాం’ అని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌, సీఐ ప్రసాద్‌ నచ్చజెప్పినా బాధితులు శాంతించలేదు. అనంతరం బాధితుల బంధువులు, పెద్దమనుషులతో డీఎస్పీ ప్రభాకర్‌, ఎస్బీ సీఐ భాస్కర్‌ మాట్లాడి.. కళాశాల యాజమాన్యంతో చర్చించారు. యోగేష్‌ మృతికి కారణాలను వివరించి.. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు, మృతుడి సోదరులకు ఉచితంగా విద్య అందిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో సాయంత్రం 6.50 గంటలకు ధర్నాను విరమించారు. ఏడు గంటలకు ప్రత్యేక అంబులెన్సులో యోగేష్‌ మృతదేహాన్ని వారి స్వగ్రామమైన గెసికపల్లెకు తరలించారు. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్సీ ఆధ్వర్యంలో సీఐలు స్రసాద్‌, నరసింహరాజు, రామ్‌భూపాల్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.

Updated Date – Apr 28 , 2025 | 01:17 AM

Exit mobile version