– సంతాపం తెలిపిన నవతెలంగాణ, ప్రజాశక్తి సిబ్బంది, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
నవతెలంగాణ – ఖమ్మం రూరల్/ హైదరాబాద్
ప్రజాశక్తి దినపత్రిక ఫొటోగ్రాఫర్ తిప్పసముద్రం వెంకటరమణ సతీమణి శిల్ప(33) అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌తో విజయవాడలో మృతి చెందారు. ఆమె స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి.. శిల్ప భౌతికకాయంపై సీపీఐ (ఎం) జెండా కప్పి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు భర్త వెంకటరమణ, పిల్లలు భవ్య, నవ్యను ఓదార్చారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) నేతలు పెరుమాళ్లపల్లి మోహన్ రావు, వడ్లమూడి నాగేశ్వరరావు, పొన్నం మురళి, భాస్కర్, వేలాద్రి, ఆరెకోడు శాఖ కార్యదర్శి శిలివేరు సత్యనారాయణ, సభ్యులు వెంకన్న, మార్కం నాగేశ్వరరావు, మల్లెల వీరయ్య, మాజీ సర్పంచ్ ఉప్పుగళ్ల వెంకటనారాయణ, ఆరెంపుల వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ, ప్రజాశక్తి సిబ్బంది నివాళి
శిల్ప మృతికి నవతెలంగాణ, ప్రజాశక్తి దిన పత్రికల సిబ్బంది సంతాపం తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో నవతెలంగాణ మొఫిసిల్ ఇన్‌చార్జి వేణుమాధవ్, స్టేట్ బ్యూరో చీఫ్ బీవీఎన్ పద్మరాజు, సీనియర్ జర్నలిస్టు లలిత, ఖమ్మం, నల్లగొండ రీజియన్ మేనేజర్లు ఎస్డీ జావీద్, పుప్పాల మట్టయ్య, ప్రజాశక్తి న్యూస్ ఎడిటర్ రాజగోపాలశర్మ, జనరల్ మేనేజర్ హరికిశోర్, నవతెలంగాణ సిబ్బంది గుమ్మడి నర్సయ్య, ఈ.వెంకటేశ్వర్లు, ఆవుల రామారావు, నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులున్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ నేతల సంతాపం
శిల్ప మృతదేహాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య,టీఎస్ పీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నరహరి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, కార్యదర్శి బి.జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాగుల్ మీరా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, యేగినాటి మాధవరావు.. పూలమాల ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ సంతాపం
ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్, మిత్రులు రమణ భార్య శిల్ప అకాల మరణం పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఒక ప్రకటనలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి అని తెలిపారు. రమణతో తనకు, సంఘానికి దీర్ఘకాలిక అనుబంధం ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆ దంపతులు తమను కలిశారని పేర్కొన్నారు. మధురైలో ఇటీవల జరిగిన సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభల్లోనూ ఫోటోగ్రాపర్‌గా రమణ తమ విధులను నిర్వహించారని గుర్తు చేశారు. అందుకు ఆయన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని గుర్తు చేశారు. చిన్న వయసులో శిల్ప అకస్మాత్తుగా మరణించటంతో రమణ, వారి పిల్లలు ఎలా తట్టుకోగలరోనని విచారం వ్యక్తం చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.