– వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి :తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
చేనేత వృత్తి కార్మికులందరికీ జియో ట్యాగ్ నెంబర్ ఇచ్చి త్రిఫ్ట్ ఫండ్ పథకం వర్తింపజేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. కార్మికులు ఉపాధి కోల్పోయి.. కష్టానికి తగిన ఆదాయం లభించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కొందరు వలస బాట పడితే, మరికొందరు ఆర్థిక ఇబ్బందు లతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత ముడి సరుకులు రంగులు, రసాయనాలు, నూలు, పట్టు ధరలు పెరగడంతో కార్మికునికి ఉపాధి కరువైందన్నారు. సహకార సంఘాల ద్వారా తయారు చేసిన బట్టలకు మార్కెట్ సౌకర్యం లేక గుట్టలుగా పేరుకు పోయాయని వివరించారు. పేరుకుపోయిన బట్టల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నూలు సబ్సిడీ పథకం నగదు బదిలీ ద్వారా కార్మికుడికి, అనుబంధ కార్మికులకు నెలకు 3000 రూపాయలు అకౌంట్లో జమ చేయాలన్నారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. చేనేత కార్మికులకు పెట్టుబడి సాయం కింద రాయితీతో కూడిన కొత్త రుణాలు రూ.5 లక్షలు ఇవ్వాలని, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వరంగ సంస్థలకు ఏకరూప దుస్తులు ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయాలని, హౌస్ కం వర్క్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత పరిశ్రమ, కార్మికుల ఉపాధి, సంక్షేమం కోసం చేనేత అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. చేనేత, జౌలి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్‌ను తమ సంఘం ఆధ్వర్యంలో కలిసిన సందర్భంలో చేనేత కార్మికుడితో పాటు వృత్తి అనుబంధ కార్మికులందరికీ జియో టాగ్ అమలు చేస్తామని, రుణమాఫీ అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. వెంటనే కిందిస్థాయి అధికారు లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, సహాయ కార్యదర్శి వనం రాములు, వాలుగొండ మధు, ఏలే శ్రీనివాస్, గడ్డం దశరథ, దయానంద్, ఏలే వెంకటేశం, రావిరాల వెంకటేశం ఉన్నారు.

చేనేతలో ‘త్రిఫ్ట్’ పథకం అమలు చేయాలి

Written by RAJU
Published on: