రాష్ట్రంలోని మత్స్యకారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక భృతిని రెట్టింపు చేసింది. గతంలో ఈ భృతి రూ.10 వేల రూపాయలు ఉండగా…దానిని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, వేట నిషేధ భృతిని రెట్టింపు చేశామని అన్నారు. పెంచిన భృతి మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని పవన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, అందుకోసం ప్రభుత్వం రూ. 259 కోట్లను కేటాయించిందని పవన్ వెల్లడించారు.
మత్స్యకారుల వలసలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, స్థానికంగా జాలర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందని, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు.
The post చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు first appeared on namasteandhra.