దేశ దిశ

క్షమించరాని క్రూరమైన చర్య

క్షమించరాని క్రూరమైన చర్య

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై అత్యంత పాశవికంగా దాడి చేసి 28 మంది ప్రాణాలు తీశారు. ఈ పెనువిషాదంపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు స్పందించారు. దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. దీనిపై వీడియో చేస్తూ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది మాటలకు అందని విషాదమని, క్షమించరాని చర్య అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నాని, విజరుదేవరకొండ తదితరులు సైతం దీన్ని అత్యంత హేయమైన చర్యగా ఖండించారు.
28 మంది అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది. – చిరంజీవి
పహల్గాం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. – కమల్‌హాసన్‌
అదో చీకటి రోజు. పహల్గాం ఘటన కలిచివేస్తోంది. అలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నా. – మహేష్‌బాబు
బాధితులను చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. శాంతి కోసం ప్రార్థిస్తున్నా. – ఎన్టీఆర్‌
పహల్గాంలో జరిగిన దాడి గురించి తెలిసి నా గుండె పగిలిపోయింది. – అల్లుఅర్జున్‌
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : టీఎఫ్‌సీసీ
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భీకరమైన ఉగ్రదాడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు, వారిలో ఇద్దరు విదేశీయులు, ఒక నేవీ అధికారి, ఒక ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కిరాతక దాడి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమాజానికి ఒక శాపంగా పరిగణించబడాలి, దానిని సమూలంగా అంతం చేయడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా శాంతి, సామరస్యం, మానవతా విలువలను కాపాడటానికి కట్టుబడి ఉంటుంది. ఈ దాడి వెనుక ఉన్న దోషులను న్యాయం ముందు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భవిష్యత్తులో ఇటువంటి దాడులను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకోవాలని కోరుతున్నాం.

Exit mobile version