– కేంద్రాలు ప్రారంభించినా ఆలస్యంగా కొనుగోళ్లకు శ్రీకారం
– ఇప్పటి వరకు 22,513 మెట్రిక్ టన్నులు కొనుగోలు
– కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ. 52.23 కోట్లు
– సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి 328 కేంద్రాలను తెరిచింది. 277 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాల్లో వరి కోతలు ప్రారంభం కాక, కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సమయం చిక్కక కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. గత శనివారం నుంచి ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,311 మంది రైతులకు చెందిన 22,513 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ 52.33 కోట్లు కాగా 76 లక్షల రూపాయలు 58 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఫ 1,408 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు
కొనుగోలు చేసిన ధాన్యంలో 1,408 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకాలకు చెందింది కాగా, ఈ ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తున్నారు. గత సంవత్సరం ఇదే తేదీ వరకు యాసంగిలో 38,896 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి కొనుగోళ్లు కొంత ఆలస్యమయ్యాయి. మరో 15 రోజుల్లో రెట్టింపు ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
ఫ యాసంగిలో 2,66,896 ఎకరాల్లో వరి సాగు
ఈ యాసంగిలో 2,66,896 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,99,051 ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేయగా, 67,845 ఎకరాల్లో మాత్రమే సన్న రకాలను సాగు చేశారు. యాసంగిలో సన్న రకాల వరి ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు బియ్యం ఎక్కువ శాతం నూకగా మారే అవకాశాలు ఉన్నది. దీంతో రైతులు సన్న ధాన్యం సాగు చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఈ సీజన్‌లో సన్న ధాన్యం సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామన్న ప్రకటన ఆలస్యంగా వెలువడడంతో అప్పటికే చాలా మంది దొడ్డు రకాలను సాగు చేశారు.
ఫ 5,86,723 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
యాసంగిలో 5,86,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడిలో రైతుల సొంత అవసరాలు, విత్తన పంటను మినహాయిస్తే 3,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇందులో 2,74,946 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి ధాన్యం 85,054 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం ఉంటుందని భావించారు. ఇప్పటి వరకు 21,105 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం 1,408 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల్లోఖరీదు చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు ఆ ధాన్యం తమ మిల్లులకు చేరినట్లుగా క్లియరెన్స్ ఇవ్వగానే కొనుగోళ్లు నమోదు చేసి రైతుల ఖాతాలకు డబ్బు జమ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్‌లో సన్న రకం వరి ధాన్యంలో జైశ్రీరాం, హెచ్‌ఎంటి రకాలకు డిమాండ్ ఉంది. ఆ రకం సాగు చేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం లేదు. ఎక్కువ ధరలకు మిల్లర్లకు అమ్మడం గాని లేక తామే మిల్లింగ్ చేసి బియ్యం అమ్మే అవకాశాలు ఉన్నాయి.
ఫ 40 వేల ఎకరాల్లో విత్తన పంట
జిల్లాలో సాగైన వరి విస్తీర్ణంలో 40 వేల ఎకరాలు విత్తన పంట ఉన్నది. హుజూరాబాద్ డివిజన్‌లో 75 శాతం పొలాలు కోసి పంట నూర్పిడి చేసినా అందులో అత్యధికం విత్తన పంట కావడంతో ఆయా కంపెనీలు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పండిన దిగుబడిని కొనుగోలు చేశారు. దీంతో ఆ డివిజన్‌లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతంత మాత్రంగానే కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది.
Updated Date – Apr 24 , 2025 | 01:50 AM