దేశ దిశ

అడుగంటుతున్న నీరు | Water flowing by way of the water


ABN
, Publish Date – Apr 09 , 2025 | 01:08 AM

ఎండలు మండిపోతున్నాయి.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి. జనవరి మాసంలో జిల్లాలో 7.01 మీటర్ల లోతున భూగర్భజలాలు లభ్యం కాగా ఇప్పుడు సగటున 8.10 మీటర్ల లోతుకు పడిపోయాయి.

అడుగంటుతున్న నీరు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎండలు మండిపోతున్నాయి.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి. జనవరి మాసంలో జిల్లాలో 7.01 మీటర్ల లోతున భూగర్భజలాలు లభ్యం కాగా ఇప్పుడు సగటున 8.10 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏప్రిల్‌ చివరి వరకు సగటున మరో మీటరు లోతుకు నీరు పడిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మూడు మాసాల్లోనే భూగర్భజలాలు మీటరు లోతుకుపైగా పడిపోవడంతో మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే బోరుబావులన్నీ ఎండిపోతున్నాయి .జిల్లాలో 2,65,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఉగాది నుంచి కోతలు మొదలయ్యాయి. మే మొదటి వారం వరకు కూడా కోతకు వచ్చే పొలాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6 వరకే నీటి విడుదల చేశారు. కోతకు వచ్చిన పొలాలు పోను సుమారు లక్ష ఎకరాల పొలాలకు కొన్నింటికి ఒక తడి మరికొన్నిటికి రెండు తడులు నీరు ఇవ్వాల్సిన అవసరమున్నది. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ సాగునీరు విస్తీర్ణం పెరిగింది. ఎండలు పెరుగడంతో బోరుబావుల ద్వారా పంట పొలాలకు నీరందించాల్సిన అవసరం ఏర్పడింది. ఏప్రిల్‌లోనే ప్రస్తుత గడ్డు పరిస్థితి ఉండగా మే నెలలో మరింత నీటి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

70శాతం బోరుబావులతోనే సాగు

జిల్లాలో 1.09 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా ఇందులో 70శాతం బోరుబావులే ఉన్నాయి. బోరుబావులతో చివరి తడికి నీరు ఇవ్వవచ్చని ఆశిస్తున్న రైతులకు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్సారెస్పీ మరో రెండు తడులకు నీరు ఇవ్వాలనే డిమాండ్‌ పలు మండలాల నుంచి వస్తున్నది. ప్రస్తుతం జిల్లాలోని గంగాధర మండలంలో భూగర్భజలాలు అత్యధిక లోతునకు పడిపోయాయి. ఈ మండలంలో భూగర్భజలాలు 15.31 మీటర్ల లోతుకు చేరాయి. చొప్పదండి మండలంలో 14.81 మీటర్ల లోతుకు, కరీంనగర్‌ అర్బన్‌ మండలంలో 10.60 మీటర్లకు, రామడుగు మండలంలో 11.10 మీటర్లకు భూగర్బ జలాలు పడిపోయాయి. గన్నేరువరం మండలంలో 9.71, కొత్తపల్లి మండలంలో 9.32, తిమ్మాపూర్‌ మండలంలో 8.82, హుజురాబాద్‌ మండలంలో 8.88, చిగురుమామిడి మండలంలో 8.27 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. సైదాపూర్‌ మండలంలో భూగర్భ జలాలు 6.13 మీటర్ల లోతుకు ఉన్నాయి. జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో 5 మీటర్లలోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తగ్గిపోతున్న భూగర్భ జలాలు రైతన్నలకు ఆందోళన కలిగిస్తున్నాయి. మెట్ట ప్రాంతాలకు కొంత ఇబ్బంది తప్పక పోయినా కనీసం ఆయకట్టు ప్రాంతంలో మరో తడికి అదనంగా నీరు ఇచ్చి వరి పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date – Apr 09 , 2025 | 01:08 AM

Exit mobile version