
ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. వయసుతో సంబంధం లేదు బిజీబిజీ లైఫ్ .. శారీరక శ్రమ కు దూరంగా ఒత్తిడికి దగ్గరగా జీవిస్తున్నారు. ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు కూడా.. చాలా సార్లు పని లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు త్వరగా అలసిపోతారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అయితే కొంత మందికి విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు. అంతేకాదు వివిధ కారణాలతో ప్రజలు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. చాలా మంది సమయానికి నిద్రపోలేకపోతున్నమంటూ వాపోతున్నారు. అటువంటి పరిస్థితిలో రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పద్ధతులను అవలంబించవచ్చు. ఇలా చేయడం వలన నిద్ర లేమి సమస్య తీరుతుంది. ఒత్తిడిని తగ్గించి నిద్రనిచ్చే యోగాసనాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..
యోగా అలసటను తగ్గించడంలో, సరైన నిద్ర పొందడానికి సహాయపడుతుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. ప్రతి యోగాసనానికి వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత నిద్రపోయే ముందు కొన్ని యోగాసనాలు చేయవచ్చు. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. యోగా నిపుణురాలు డాక్టర్ సంపూర్ణ మాట్లాడుతూ.. నిద్రపోయే గంట ముందు ఫోన్ వాడవద్దు అని సూచించారు. అంతేకాదు కొన్ని యోగాసనాలు కూడా నిద్ర లేమి సమస్యని తీరుస్తాయి.
భ్రమరి ప్రాణాయామం: భ్రమరి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ యోగాసనం మిమ్మల్ని చాలా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. మంచం మీద పడుకుని.. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. శరీరాన్ని రిలాక్స్ గా చేయండి. ఈ యోగాసనం రోజులోని అలసట, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
శవాసనం : శవాసనం ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఈ యోగాసనం వేయడానికి మంచం మీద వీపు పెట్టి పడుకోండి. దీని తరువాత రెండు చేతులను శరీరానికి రెండు వైపులా ఉంచండి. శరీరాన్ని వదులుగా ఉంచి.. ఆపై అరచేతులను పైకి తిప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి. మీరు దీన్ని 3 నుంచి 5 నిమిషాలు చేయవచ్చు.
వాల్ పోజ్: గోడకు ఆసరాగా కాళ్ళను పైకి లేపడం అనే భంగిమను లెగ్స్ అప్ వాల్ పోజ్ అంటారు. ఈ ఆసనం వేయడానికి.. మీ వీపుపై పడుకోండి. దీని తరువాత తుంటిని గోడకు దగ్గరగా ఉంచి కాళ్ళను గోడపై 90 డిగ్రీల వరకు పైకి లేపండి. తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. కళ్ళు మూసుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. ఈ ఆసనం అలసటను తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ యోగాసనాలు PCOD , వంధ్యత్వ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే, నిద్రపోలేని వారు, రోజంతా ఆఫీసులో కుర్చీపై కూర్చొని పనిచేసే వారు లేదా ఎక్కువ ప్రయాణం చేసే వారు.. కాళ్ళు వేలాడదీస్తే.. కాళ్ళలో వాపు వచ్చే వారు ఈ ఆసనం వేయడం మంచిది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)