- విల్ పుకోవ్‌స్కీ సంచలన నిర్ణయం
- క్రికెట్ నుంచి తప్పుకొన్న ఆస్ట్రేలియా యువ ఓపెనర్
- 13 సార్లు కంకషన్‌కు గురైనట్లు సమాచారం
- ఇకపై వ్యాఖ్యానం లేదా కోచింగ్ వైపు

ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పుకోవ్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తాను తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. కంకషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు 27 ఏళ్ల పుకోవ్‌స్కీ స్పష్టం చేశాడు. తలకు పదే పదే గాయాలవడం అతని కెరీర్‌ను దెబ్బతీసింది. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపుగా 13 సార్లు కంకషన్‌కు గురైనట్లు సమాచారం. కంకషన్ కారణంగా పుకోవ్‌స్కీ కెరీర్ పూర్తిగా మొదలు కాకముందే.. ముగింపుకు చేరింది. ఇకపై వ్యాఖ్యానం లేదా కోచింగ్ వైపు వెళ్లనున్నట్లు పుకోవ్‌స్కీ తెలిపాడు.
విల్ పుకోవ్‌స్కీ ప్రతిభావంతుడైన క్రికెటర్. దేశీ క్రికెట్లో సత్తాచాటి.. ఆస్ట్రేలియా భవిష్యత్ బ్యాటింగ్ స్టార్‌గా ప్రశంసలు పొందాడు. అంతేకాదు డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్‌గానూ అంచనాలు పెంచాడు. కానీ కంకషన్ పుకోవ్‌స్కీ ఆటకు అడ్డుకట్ట వేసింది. మార్చి 2024లో టాస్మానియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరెడిత్ బౌలింగ్‌లో పుకోవ్‌స్కీ గాయపడ్డాడు. గాయం కారణంగా ఆట మధ్యలో రిటైర్ కావాల్సి వచ్చింది. ఆపై క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య ప్యానెల్ తన భవిష్యత్తును కాపాడుకోవడానికి పుకోవ్‌స్కీకి సూచించింది. వైద్య నిపుణుల సూచన మేరకు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని తాజాగా నిర్ణయించుకున్నాడు.
Also Read: IPL 2025 – RCB: 5, 10, 17 ఏళ్లు.. ఆర్సీబీ అద్భుత విజయాలు!
విల్ పుకోవ్‌స్కీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆటపై దృష్టి పెట్టాలనుకున్నప్పుడల్లా అనారోగ్యం బారిన పడడం, తల తిరుగుతున్నట్లు అనిపించిందని వెల్లడించాడు. కంకషన్ పరిణామాలు తన జీవితంపై భయంకరమైన ప్రభావాన్ని చూపాయని తెలిపాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో పుకోవ్‌స్కీ ఒకే ఒక్క టెస్టు ఆడాడు. 2021లో సిడ్నీలో భారత్‌పైనే ఆ మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2017లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన పుకోవ్‌స్కీ 36 మ్యాచ్‌ల్లో 2350 పరుగులు చేశాడు. 14 లిస్ట్- ఎ మ్యాచ్‌ల్లో 333 పరుగులు సాధించాడు.