మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇక ఇందులో ఉండే ఫైబర్, ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇదే కాకుండా ఇందులో క్యాలరీలు తక్కువ. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు మొలకలలో ఇనుము శాతం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నివారించడంలో సహాయపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే చాలామంది రోజూ మొలకలు తినడాన్ని డైట్‌లో భాగం చేసుకుంటారు. కానీ, అందరికీ ఇవి రోజూ ఒకే టేస్ట్‌తో తినడం నచ్చకపోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చని బలవంతంగా తింటూ ఉంటారు. అలా కాకుండా మొలకలతో భేల్ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రుచికి మీరు ఫిదా అయిపోతారు. ఇది రుచికరంగానూ ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మొలకలతో భేల్ తయారీకి కావాలసిన పదార్థాలు..
మొలకెత్తిన పెసరపప్పు- కొన్ని, కాల్చిన వేరుశనగలు- కొన్ని ,చింతపండు బెల్లం కలిపి చేసిన తీపి, పుల్లని చట్నీ- కాస్త, బంగాళాదుంప, పుల్లని చట్నీ-కాస్త, ఉడకబెట్టిన ఉల్లిపాయ- 1, దోసకాయ ముక్కలు, టమాటో-1, దానిమ్మ గింజలు, ,క్యారెట్ తురుము, నిమ్మరసం, ఉప్పు, తాజాగా పొడి చేసిన నల్ల మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, కారం పొడి, కొత్తిమీర, ఫైన్ సేవ్
మొలకలతో భేల్ తయారీ విధానం..
మొలకలు భేల్ తయారు చేయడానికి ఒక రోజు ముందుగా నానబెట్టిన పెసరపప్పును నీటితో వడకట్టి ఒక రోజు కాటన్ గుడ్డలో కట్టి ఉంచండి. మొలకలు కనిపించినప్పుడు మరుసటి రోజు వాటి భేల్ సిద్ధం చేయండి. అప్పటికప్పుడు కావాలంటే మీరు మార్కెట్ నుంచి రెడీమేడ్ మొలకలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక మొలకలను ఆవిరి మీద ఉడికించి, ఉల్లిపాయ, టమోటా, దోసకాయలను మెత్తగా కోసి భేల్ తయారు చేసుకోండి. తరువాత బంగాళాదుంపలను తొక్క తీసి మెత్తగా కోయాలి. ఇప్పుడు క్యారెట్ తురుము, దానిమ్మ గింజలను రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో మొలకలు వేసి అందులో అన్ని కూరగాయలను వేయండి. బాగా కలిపిన తర్వాత అన్ని మసాలా దినుసులు, నిమ్మరసం వేసి బాగా కలపండి. తర్వాత చింతపండు బెల్లం కలిపి చేసిన తీపి పుల్లని చట్నీ వేసి బాగా కలపండి. చివరగా వేరుశెనగలు, కొన్ని దానిమ్మ గింజలు వేసి మళ్ళీ కలపండి. సన్నగా తరిగిన సేవ్, కొత్తిమీర ఆకులు, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.