అన్నం తినడం అనేది ఓ పని కాదు.. అత్యంత ముఖ్యమైన విధి. శరీరం అనే వాహనాన్ని నడిపే ఇంధనం ఆహారం. సరైన సమయంలో.. సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే అది శరీరం అనే బండిని సాఫీగా నడిపిస్తుంది. లేదంటే మాత్రం షెడ్డుకెళ్తుంది. సమయానికి భోజనం చేయడం ఎంత ముఖ్యమూ.. తినడానికి ముందు, తిన్న తర్వాత చేయాల్సిన, చేయకూడని పనుల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఆ పనులు ఏంటి.. వాటిని చేయడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అన్నం తిన్న వెంటనే చేయాల్సిన పనులు..
భోజనం చేసిన తర్వాత మన శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో రక్త ప్రసరణ అధికంగా కడుపు భాగం వైపు కేంద్రీకృతమవుతుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే.. తిన్న వెంటనే 10-15 నిమిషాల పాటు నడవడం, 5 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి.. తీసుకున్న ఆహారం తర్వగా, సులభంగా జీర్ణం అవుతుంది అంటున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో జరిగిన అధ్యాయనంలో.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల.. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. అలానే ఆహారం తిన్న తర్వాత చేతులు, ముఖం కడుక్కోవడం వల్ల తాజాగా ఉండటమే కాక.. నీరసం కూడా తగ్గుతుందని ఈ అధ్యాయనం వెల్లడించింది.
పోషాకాహార నిపుణులు ప్రకారం చూసుకుంటే.. భోజనం చేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగడం మంచి పద్దతి అంటున్నారు. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజలో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం.. గోరు వెచ్చని నీరు.. కడుపులోని కొవ్వు పదార్థాలను కరిగించి.. జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పని చేసేలా చేస్తుందని తెలిపింది. అలానే భోజనం తర్వాత 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు.
చేయకూడని పనులు..
భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే.. అవి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మానుకోవాలి. ఎందుకంటే.. తిన్న తర్వాత నిద్ర పోతే.. ఇది రిఫ్లెక్స్ డిసీజ్, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. 2023లో బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో నిర్వహించిన సర్వేలో.. భోజనం తర్వాత వెంటనే పడుకునే వారిలో.. 50శాతం మందిలో అజీర్ణ సమస్యలు పెరిగినట్లు గుర్తించారు. అలానే భోజనం తర్వాత తీవ్రమైన వ్యాయామం, బరువైన పనులు చేయడం కూడా నిషేధం. ఈ పనులు చేస్తే.. అవి రక్త ప్రవాహాన్ని కండరాల వైపు మళ్లించి, జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయంటున్నారు నిపుణులు.
అలానే భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగవద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే కూల్ వాటర్ తాగితే.. ఇది కడుపులో ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించి, ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. అంతేకాక భోజనం చేసిన తర్వాత వెంటనే స్నాయం చేయడం కూడా ఆరోగ్యానికి అత్యంత హానికరం అంటున్నారు నిపుణులు. ఇది శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు పెంచి.. జీర్ణ శక్తిని బలహీనపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే భోజనం తర్వాత టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలు తాగడం కూడా తాగవద్దని.. ఇవి ఆమ్ల స్థాయిని పెంచుతాయని అంటున్నారు.
సమతుల్య విధానం
అన్నం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు జీర్ణక్రియకు సమయం ఇవ్వడం మంచిది. ఈ సమయంలో నెమ్మదిగా నడవడం, విశ్రాంతి తీసుకోవడం వంటివి ఆరోగ్యాన్ని కాపాడతాయి. భోజనం చేసిన తర్వాత సరైన పనులను ఎంచుకోవడం ద్వారా.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. భోనం తర్వాత నడక, విశ్రాంతి మంచి అలవాట్లు కాగా.. నిద్ర, వ్యాయామం, చల్లని నీరు తాగడం వంటి పనులు మానుకోవడం ఉత్తమం అంటున్నారు. ఈ సమతుల్య విధానం పాటించడం వల్ల ఆహారం శక్తిగా మారుతుంది కానీ భారంగా కాదంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి:
ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..
వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి