
తలనొప్పి..బాబోయ్ ఈ మాట చెబితే కూడా కొందరు హడలెత్తిపోతుంటారు.. ఎందుకంటే.. దాదాపు అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ప్రధానమైనది చాలా మంది ఈ తలనొప్పితో అవస్థ పడుతుంటారు. వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఏటా ప్రతి నలుగురిలో ఇద్దరి నుంచి ముగ్గురు తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారని వెల్లడి. వారిలో 30 శాతం మంది మైగ్రేన్ తలనొప్పి కోసం మందులు వాడుతున్నారని చెప్పింది. ఇలా కంటికి కనిపించకుండా మనిషిని నిలువునా ఇబ్బందికి గురి చేసే ఈ తలనొప్పి వస్తే పని చేయడానికి శరీరం సహకరించదు. అసౌకర్యం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని పనులతో తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ఎక్కువ మందిని వేధిస్తున్న ఈ తలనొప్పి ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు వైద్యులు. ఒకటి ప్రైమరీ తలనొప్పి, రెండోది సెకండరీ తలనొప్పి. ఒత్తిడి వల్ల ఎక్కువ మంది తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే.. మైగ్రేన్ తలనొప్పి వల్ల కూడా చాలా మంది అవస్థపడుతున్నారు. ఈ రెండు రకాలను ప్రైమరీ తలనొప్పిగా వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే, ఇన్ఫెక్షన్లు లేదా తలకు దెబ్బ తగలడం వల్ల వచ్చే తలనొప్పులను సెకండరీ తలనొప్పిగా చెబుతున్నారు. ఇందులో ఆ కారణానికి తగిన చికిత్స అందించాలని సూచిస్తున్నారు. అయితే, తలనొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు మీకు ఎంతో ఉపయోగడపతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి.
తలనొప్పి మరీ తీవ్రంగా వేధిస్తున్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇది వికారం నుండి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుంది, ఇది కొన్నిసార్లు తలనొప్పితో పాటు వస్తుంది. లాగే, పిప్పరమింట్ నూనెను తలకు రాసుకోవడం వల్ల ఒత్తిడి, తలనొప్పి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
అంతేకాదు..బాదం, పాలకూర, అవోకాడోస్ వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే, లావెండర్ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. నీళ్లు తక్కువగా తాగటం వల్ల కూడా తలనొప్పి వేధిస్తుంది. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగటం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..