ఆరోగ్యం బాగుండాలంటే సీజనల్ ఆహారాలు తీసుకోవాలి. ప్రతి సీజన్ లో తీసుకునే పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. సీజన్ లో మాత్రమే లభించే కూరగాయలలో కాలీఫ్లవర్ ముఖ్యమైనది. చాలా మంది కాలీఫ్లవర్ ను ఇష్టపడతారు. దీంతో బోలెడు రకాల వంటలు చేసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. కాలీఫ్లవర్ లో పురుగుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టినా సరే.. వాటిని కష్టపడి తొలగించి మరీ వండుకుని తింటారు. అన్ని కూరగాయల లాగే కాలీఫ్లవర్ కూడా రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. అయితే కాలీఫ్లవర్ అందరికీ మంచిది అనుకుంటే పొరపాటే.. దీన్ని ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పోషకాలు..
కాలీఫ్లవర్ లో విటమిన్-సి, విటమిన్-కె, ఫోలెట్, విటమిన్-ఎ, ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్ వంటి విటమిన్లు. కాల్షియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనాలు..
కాలీఫ్లవర్ లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది.
కాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ లో కోలిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈ పోషకాన్ని తీసుకోరు. ఇది శరీరంలో డిఎన్ఏ సంశ్లేషణ చేయడంలో, సరైన జీవక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. మెదడు అభివృద్దికి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అవసరం అవుతుంది.
వీరు తినకూడదు..
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. కాలీఫ్లవర్ థైరాయిడ్3, థైరాయిడ్4 హార్మోన్లను ప్రభావితం చేస్తుందట. అందుకే థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ తినకూడదు.
కాలీఫ్లవర్ లో విటమిన్-ఎ, బి, సి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని తినడం వల్ల కొందరిలో అపానవాయువు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. పిత్తాశయం లేదా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినకూడదు.
ఈ జాగ్రత్త తప్పనిసరి..
కాలీఫ్లవర్ ను ఎవరు తీసుకున్నా దాన్ని మితంగానే తీసుకోవాలి. ఎప్పుడూ ఉడికించిన కాలీఫ్లవర్ మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ ను రెగ్యులర్ గా తీసుకోకూడదు. దీన్ని గ్యాప్ తీసుకుని తినాలి. థైరాయిడ్ ఉంటే మాత్రం కాలీఫ్లవర్ ను అస్సలు టచ్ చేయకపోవడం మంచిది.
Read Latest Navya News and Telugu News
https://www.andhrajyothy.com/2024/navya/beauty-tips/multani-mask-is-enough-to-get-rid-of-oily-skin-ssd-spl-1281641.html#google_vignette
https://www.andhrajyothy.com/2024/health/amazing-benefits-of-eating-raw-moong-dal-daily-srn-spl-1331299.html