Well being : 90% భారతీయుల్లో విటమిన్ డి లోపం.. కారణమేంటో తెలుసా..

Written by RAJU

Published on:

భారత్ ఒక ఉష్ణమండల దేశం. ఇక్కడ సంవత్సరం పొడవునా సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది. అయినా, భారతీయులలో శరీరానికి అత్యవసరమైన విటమిన్ డి లోపం వేగంగా పెరుగుతున్నట్లు ఓ అంతర్జాతీయ జర్నల్‌లో వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణాలు.. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులు కీలకపాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.పైకి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా శరీరానికి తగు మోతాదులో విటమిన్ డి అందపోతే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

సైంటిఫిక్ జర్నల్స్ అధ్యయనం ప్రకారం, దక్షిణ భారత్‌లోని పట్టణ ప్రాంతాల పెద్దవారిలో విటమిన్ డి లోపం సర్వసాధారణంగా ఉంది. ఉత్తర భారతదేశంలో అయితే, 50 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతుల్లో 91.2% మంది తీవ్ర విటమిన్ డి లోపం కలిగి ఉన్నారు. 2023లో టాటా 1ఎంజి ల్యాబ్స్ నిర్వహించిన సర్వేలో..ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనే కఠిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసున్న యువతలో 84% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.

విటమిన్ డి ఎందుకంత ముఖ్యం?

  • గాయాలు త్వరగా మానిపోయేలా చేయడంలో విటమిన్ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ విటమిన్ అత్యవసరం.

  • దీని లోపం వల్ల అలసట, కీళ్ల నొప్పులు, తరచుగా జబ్బు పడడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక లోపంగా మారితే మధుమేహం, క్యాన్సర్, రికెట్స్ వంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది.

విటమిన్ డి లోపానికి కారణాలు :

  • నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ సమయం ఇల్లు లేదా కార్యాలయంలోనే గడుపుతారు. దీని కారణంగా వారి చర్మానికి తగినంత సూర్యరశ్మి అందదు. అదీగాక భారతీయుల్లో అధిక శాతం శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరిస్తూ ఉంటారు. అందుకే శరీరం ఎక్కువ మొత్తంలో సూర్యరశ్మిని గ్రహించలేదు.

  • అతినీలలోహిత (యూవీ) కిరణాలు నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్‌ లోషన్లు ఎక్కువగా ఉపయోగించటం, కాలుష్యం వంటివి విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు.

  • భారతీయుల చర్మంలో మెలనిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువసేపు ఎండలో గడపడం అవసరం.

  • విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు చాలా తక్కువ.

సాధారణ పరిష్కారాలు :

  • ఉదయం 8 నుండి 11 గంటల మధ్య 15-30 నిమిషాలు ఎండలో గడపండి.

  • మీ ఆహారంలో చేపలు, గుడ్డు, బలవర్థకమైన తృణధాన్యాలు చేర్చుకోండి.

  • వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి.

Subscribe for notification
Verified by MonsterInsights