Cold and Cough : చలికాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతాయి. ముఖ్యంగా జలుబు సమస్య.. ఒక్కసారి వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదిలిపెట్టదు. ట్యాబ్లెట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా అది తగ్గాల్సిన టైమ్‌లోనే తగ్గుతుంది. ఇక జలుబు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అనేక ఆరోగ్య సమస్యలు వెంట వస్తాయి. తలనొప్పి, తుమ్ములు, దగ్గు ఇలా ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబు, దగ్గును ఇంటి చిట్కాలతో కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు.
వేడి నీటిలో..
జలుబు చేసినప్పుడు నీటిని వేడి చేసుకుని తాగితే మంచిది. అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగినా జలుబు నుంచి కాస్తా ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా చేస్తే జలుబు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, అప్పుడప్పుడూ అదే వేడి నీటిలో దాల్చినపొడి కలిపి ఆవిరి పట్టినా కూడా తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు కూడా తెరుచుకుంటాయి. ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో మాత్రమే కాకుండా.. అందులో పసుపు, బామ్ వంటివి వేసి ఆవిరి పడితే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అంతేకాకుండా జలుబు త్వరగా తగ్గుతుంది.
పసుపు పాలు..
పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబు సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి వేడి పాలల్లో కాసింత పసుపును కలుపుకుని తాగితే ఎంతో మంచిది. నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి.
అల్లం మంచి ఔషధం..
జలుబుతో బాధపడేవారు.. అల్లం టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గుని తగ్గిస్తుంది. కాబట్టి.. రెగ్యులర్‌గా అల్లంతో చేసిన టీ తాగితే ఆరోగ్య సమస్యలను దూరం అవుతాయి. అల్లంను రెగ్యులర్ టీలో అయినా వేసుకోవచ్చు. లేదంటే.. వేడినీటిని మరిగించి అందులో కొన్ని అల్లం ముక్కలు వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులను వేసి తాగేయొచ్చు. దీని వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది.
తుమ్ములు పరార్..
జలుబు ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులతో టీ చేసుకుని తాగితే జలుబు చాలా వరకూ తగ్గుతుంది.
మిరియాల పాలు..
మిరియాల పాలు తాగనా జలుబు సమస్య త్వరగా తగ్గుతుంది. అయితే, మిరియాలు ఎక్కువగా వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వేడి చేస్తుంది.
వాముతో దగ్గు దూరం..
దగ్గుతో బాధపడేవారు ఆ స మయంలో వాము ఆకులను నమలాలి. అలా నమలి రసాన్ని మింగడం వల్ల దగ్గు సమస్య దూరం అవుతుంది.
కర్పూరంతోనూ ఫలితం..
జలుబు సమస్యతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా, నీటిలో కర్పూరం వేసి కాసేపు ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. జలుబు తగ్గేవరకూ రెండు మూడు గంటలకు ఇలా ఓసారి చేయాలి.
(Note: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ వీటిని ధృవీకరించలేదు.)