- పార్లమెంట్ ముందుకు నేడు వక్ఫ్ బిల్లు..
- వ్యూహాలు రచిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు..
- రెండు సభల్లో ఎన్డీయేకు బలం..

Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మూడు రోజుల పాటు సభకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించాయి. నిన్న సాయంత్రం వక్ఫ్ బిల్లుపై ఇండియా కూటమి పార్టీలు సమావేశాన్ని నిర్వహించాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటామని, అయితే బిల్లుకు మాత్రం మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశాయి. ఈ బిల్లుపై చర్చించడానికి రెండు సభలకు 8 గంటలు కేటాయించినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎన్డీయే మిత్ర పక్షాలపై జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మరియు తెలుగుదేశం పార్టీ (టిడిపి) వంటి కీలక మిత్రుల మద్దతుపై నమ్మకంతో ఉంది. ఇప్పటికే టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వంటి పార్టీల నాయకులు బిల్లు ఆమోదాన్ని అడ్డుకోబోమని ధృవీకరించారు. బిల్లు వల్ల ముస్లింల హక్కులు తగ్గుతాయని ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశాయి. ఇక షిండే నేతృత్వంలోని శివసేన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఇప్పటికే వారి ఎంపీలకు విప్ జారీ చేసింది. జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిజేస్తోంది.
మరోవైపు, వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎస్పీ, ఎంఐఎం వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. నిన్న జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మరియు కెసి వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుప్రియా సులే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
పార్లమెంట్‌లో బలాబలాలు:
లోక్‌సభ: లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీకి 272 ఓట్ల సాధారణ మెజారిటీ అవసరం. 542 మంది ఎంపీలలో 240 మంది బీజేపీ ఎంపీలు, 12 మంది జేడీయూ, 16 మంది టీడీపీ, ఐదుగురు ఎల్జేపీ(ఆర్‌వి) నుంచి ఇద్దరు ఆర్ఎల్డీ, శివసేనకు చెందిన 07 మంది ఎంపీలు ఉన్నారు. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
రాజ్యసభ: రాజ్యసభలో ఎన్డీయేకు 125 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి నుంచి 98, జేడీయూ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు, శివసేన నుంచి ఒకరు, ఆర్ఎల్డీ నుంచి ఒకరు ఉన్నారు. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో బిల్లుకు 119 మంది ఎంపీల మద్దతు అవసరం. అసోం గణ పరిషత్, తమిళ మన్నిలా కాంగ్రెస్ వంటి పార్టీలతో పాటు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని బీజేపీ భావిస్తోంది.