వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సభ ముందుకు రానుంది..వక్ఫ్‌బిల్లు. ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చించాలని BAC సమావేశంలో నిర్ణయించారు. అయితే BAC సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ చేశాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, వ్యతిరేకిస్తామని ఇండి కూటమి నేతలు స్పష్టం చేశారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లులపై కనీసం 12 గంటల పాటు చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వక్ఫ్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం మండిపడుతోంది. బీజేపీ హైకమాండ్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్‌సభకు విధిగా హాజరు కావాలని విప్‌లో పేర్కొన్నారు. ఈ బిల్లును ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించినట్టు కేంద్రం వెల్లడించింది. జేడీయూ , టీడీపీ సూచనలను బిల్లులో పొందుపర్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. నేడు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. బిల్లుపై మాట్లాడేందుకు ఎన్డీఏ కూటమికి 4 గంటల 40 నిముషాల సమయాన్ని కేటాయించారు. బీజేపీకి 4 గంటల సమయాన్ని కేటాయించారు.
రాజ్యసభలో గురువారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతామని చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఒకే రోజు జరిగిపోతుందని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ . బిహార్ సీఎం నితీష్, ఏపీ సీఎం చంద్రబాబు బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర మతాలకు లేని నిబంధనలను ముస్లింలకు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండి కూటమి నేతలు సమావేశమయ్యారు. పార్లమెంటులో ఈ రోజు ఎలాంటి సన్నివేశాలు ఎదురవుతాయో చూడాలి.