రంగు నలుపు.. పొడవైన తోక.. పెద్ద చెవులు.. పదునైన పళ్లు.. పిల్లి లాంటి ఆకారం కానీ ఉడత లాంటి శరీరం..! వింత జంతువు ఒకటి విశాఖలో కంటపడింది. కైలాసగిరి దిగువన వీఎంఆర్డిఏ వాకింగ్ ట్రాక్‌లో ఇది వాకర్స్‌కు తారసపడింది. అయితే.. అది కదలలేని స్థితిలో ఉంది. దీంతో సపర్యలు చేసిన వాకర్స్.. జూ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత దాన్ని అడవుల్లో విడిచిపెట్టారు. దాన్ని అటవీ ప్రాంతాల్లో నివసించే ఆసియా పామ్ సివెట్‌గా గుర్తించారు.. పిల్లి జాతికి చెందిన పునుగు పిల్లి మాదిరి జీవి అని తెలిపారు.
వాస్తవానికి ఈ పిల్లి జాతికి చెందిన ఆసియా పామ్ సివెట్.. అటవీ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈ జీవులు 53 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. బరువు రెండు నుంచి ఐదు కిలోల వరకు పెరుగుతుంది. గ్రంథాల ద్వారా సువాసన వెదజల్లే స్రావాన్ని విడుదల చేయడం దాని ప్రత్యేకత.
ఆసియా పామ్ సివెట్.. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, లావోస్, కాంబోడియా, వియాత్నం, చైనా, ఫిలిప్పీన్స్ అడవుల్లో కనిపిస్తుంది. బెర్రీలు, గుజ్జు పండ్లు ఆహారంగా తీసుకుంటుంది. దీంతో అడవుల్లో విత్తన వ్యాప్తికి సాయపడుతుంది. అలానే ఎలుకలు, క్షీరదాలు, కీటకాలను కూడా తింటుంది. ఎలుకల జనాభాను నియంత్రించడం ద్వారా సివెట్ పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సివెట్‌లు సమీప అటవీ ప్రాంతాల నుంచి.. అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.