కామెడీ షోలో సభికులు చప్పట్లు కొడుతుంటే కమెడియన్ రెచ్చిపోయాడు. వెనకా ముందు చూసుకోకుండా కామెడీ పండించాడు. తన స్కిట్‌లోకి రాజకీయ నాయకులను లాగాడు. ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై జోకులు పేల్చాడు. అంత వరకు అయితే పర్వాలేదు అనుకున్నారు. కానీ, ఆయనను దేశద్రోహిగా పేర్కొన్నాడు. ఇంకేముంది రాజకీయ దుమారం చెలరేగింది. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఇది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కమ్రా శిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను ద్రోహిగా పేర్కొన్నారు. దీంతో కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశిస్తూ కమ్రా ఓ జోక్ పేల్చాడు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్.. ఏక్‌నాథ్ శిండేను ద్రోహిగా చెప్పుకొచ్చాడు. ఈసందర్భంగా దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనువదించి పాడారు.
ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘కునాల్ కా కమల్’ అంటూ పోస్టులో రాశాడు. దీంతో ఇదికాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటన విడుదల చేసింది.
కమెడియన్ కునాల్ కమ్రాపై కేసు నమోదు..
కమెడియన్ కునాల్ కమ్రాపై చర్యలు తీసుకోవాలని శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. హోటల్‌పై దాడిని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్ పాడిన పాటలో వంద శాతం నిజమే ఉందన్నారు ఠాక్రే. కుట్రపూరితంగానే హోటల్‌పై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆదిత్య ఠాక్రే విమర్శిచారు.
వీడియో చూడండి:
Maharashtra ❤️❤️❤️ pic.twitter.com/FYaL8tnT1R
— Kunal Kamra (@kunalkamra88) March 23, 2025