తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే చాలా మంది కలవరానికి గురవుతుంటారు. అమ్మో జుట్టు రాలిపోతోందని ఎంతో అందోళన చెందుతారు. ఎందుకంటే జుట్టు అందానికే కాదు.. ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒత్తయిన జుట్టు ఉన్నవారికి అందంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం అనేక రకాల కేశసంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి జుట్టు సడన్ గా ఊడిపోతే.. అది కూడా ఓ వారం రోజుల్లోనే మొత్తం వెంట్రుకలు రాలిపోయి.. బట్టతల వస్తే..? ఇలా ఎలా జరుగుతుంది అంటారా.. ఆ గ్రామంలో అలాగే జరుగుతోంది. దీనికి వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.
సడెన్‌గా జుట్టు ఊడిపోయి, బట్టతల వచ్చేస్తే, ఎవరికైనా ఎలా ఉంటుంది. మానసికంగా డిస్టర్బ్ అవుతారు. మొన్నటిదాకా చాలా జుట్టు ఉండేది.. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని బాధపడతారు. జుట్టు ఎక్కువగా ఉండటం అనేది చాలా మందికి ప్లస్ అవుతుంది. కెరీర్ పరంగా వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. కానీ జుట్టు ఊడిపోతే, అదో అసంతృప్తిగా ఉంటుంది. నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ.. డిప్రెషన్ లోకి వెళ్తుంటారు.
నిగనిగలాడే జుట్టు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాంటిది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న జుట్టు వారం రోజుల్లోనే పూర్తిగా రాలిపోయి బట్టతల వచ్చేస్తే.. అమ్మో ఇంకేమైనా ఉందా? అని భయపడతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతోమందిని జుట్టు రాలే సమస్య వేధిస్తూనే ఉంటుంది. మహారాష్ర్టలోని మూడు గ్రామాల ప్రజలకు మాత్రం అలాంటి ఊహించని సంఘటనే జరిగింది.
బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాలు బోర్గావ్, కల్వాడ్, హింగ్నా ప్రజలను గత కొంతకాలంగా జట్టు రాలే సమస్య పట్టి పీడిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే జుట్టంతా రాలిపోయి బట్టతల వచ్చింది. జుట్టు ఇష్టమొచ్చినట్లు రాలిపోయింది. తలపై చెయ్యి వేస్తే చాలు.. కోడి ఈకలు వచ్చినట్లుగా.. వెంట్రుకలు ఊడొచ్చేస్తున్నాయి. వాళ్లకు ఏమైంది అనేది అర్థం కాలేదు. ఒక వ్యక్తికైతే ఏకంగా వారం రోజుల వ్యవధిలో వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టతల వచ్చిందట! ఈ హఠాత్పరిణామానికి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వేగంగా జుట్టు రాలుతుండటం వారిలో గుబులు పుట్టిస్తోంది.

తలపై వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి. వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలోనే ఓ వ్యక్తికి బట్టతల కనిపించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. సమస్య తీవ్రంగా మారుతుండడంతో మూడు గ్రామాలను వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. కొందరు బాధితులను పరిశీలించారు.
ఆ ప్రాంతంలో ప్రజలు వాడిన గోధుమల్లో సెలెనియం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తిచారు. ఆహారంలో సెలెనియం ఎక్కువగా ఉంటే.. ఆ ఆహారం తిన్నవారికి ఎలోపెసియా సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎలోపెసియా సమస్య తలెత్తితే జుట్టు విపరీతంగా రాలిపోతుందన్నారు.
ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ఇచ్చిన గోధుమల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చారు. మరి ఈ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి అని గమనిస్తే.. ఇవి పంజాబ్, హర్యానా నుంచి మహారాష్ట్రకు వచ్చాయని తెలిసింది. గోధుమల్లో ఉండే సెలెనియం నిజానికి మనకు చాలా అవసరమైన మూలకం. కానీ ఇది కొద్దిగానే అవసరం. ఎక్కువైతేనే ఇలాంటి ఎఫెక్ట్ చూపుతుంది.
బుల్ధానా జిల్లాలోని జుట్టు ఊడే గ్రామాల్లో స్థానికుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని టెస్ట్ చెయ్యగా షాకింగ్ విషయం తెలిసింది. కడగని గోధుమల్లో కేజీకి 14.52 మిల్లీగ్రాముల సెలెనియం ఉంది. కడిగిన తర్వాత.. కేజీకి 13.61 మిల్లీ గ్రాముల సెలెనియం ఉంది. నిజానికి ఇది కేజీకి 1.9మిల్లీగ్రాములే ఉండాలి. అంటే ఉండాల్సిన దాని కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా సెలెనియం ఉందని తేలింది. అందుకే ఇంతలా జుట్టు రాలిపోయిందని వారికి అర్థమైంది.