Viral: 9 వేల కిలోమీటర్ల దూరాన ఆపరేషన్ థియేటర్.. రిమోట్ కంట్రోలర్‌తో సర్జరీ!

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: వైద్య ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. జ్యూరిచ్‌లోని స్వి్స్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌కు చెందిన వైద్యులు రిమోట్ కంట్రోల్ సాయంతో పందికి కడుపు ఆపరేషన్ నిర్వహించారు. జ్యూరిచ్‌లోని సర్జన్, 9300 కిలోమీటర్ల దూరంలోని హాంకాంగ్‌లో ఉన్న టెక్నీషియన్‌తో కలిసి వీడియో గేమ్ కంట్రోలర్ ఉపయోగించి ఎండోస్కోపీ సర్జరీ చేశారు. ఈ ప్రయోగాత్మక ఆపరేషన్ తాలూకు వివరాలు అడ్వాన్సడ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి (Health).

Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!

ఈ ఆపరేషన్‌లో మేగ్నెటిక్ ఎండోస్కోప్‌ను వినియోగించారు. దీన్ని బయటి నుంచి ఆయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించారు. జ్యూరిచ్‌లో ఉన్న సర్జన్ తన వద్ద ఉన్న వీడియో గేమ్ కంట్రోలర్ ఉపయోగించి హాంగ్‌కాంగ్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న పంది కడుపులోంచి బయాప్సీ శాంపిల్‌ను తీశారు. ఈ ప్రక్రియలో ఆపరేషన్ థియేటర్‌లోని కన్సోల్ ఆపరేటర్ సాయపడ్డారు.

ఈ సాంకేతికతతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చైనీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. షానన్ మెలిసా తెలిపారు. వైద్య సదుపాయాలు లేని సుదూర ప్రాంతాలకు ఈ సాంకేతికత ఓ వరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, అత్యాధునిక వైద్య వసతులు, నిపుణులు అందుబాటులో లేని ప్రాంతాల్లోని పేషెంట్లకు సుదూరాన ఉన్న డాక్టర్లు రిమోట్ కంట్రోలర్ సాయంతో చికిత్స అందిచొచ్చన్నారు. ఆపరేషన్లతో పాటు రోగికి అవసరమైన వైద్య పరీక్షలు కూడా నిర్వహించొచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేగు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ సాంకేతికతతో తక్షణ వైద్య సేవలు అందించొచ్చని తెలిపారు.

కాగా, ఈ ప్రయోగానికి సంబంధించి తదుపరి దశల్లో మనిషి కడుపుపై ఆపరేషన్ చేస్తామని స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూఫ్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డా. బ్రాడ్లీ నెల్సన్ అన్నారు. ఈ సాంకేతికతతో ఎండోస్కోపీ ప్రక్రియలతో పాటు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే సౌలభ్యం కూడా ఉందన్నారు. న్యూరోవాస్క్యులార్, ఫీటల్ సర్జరీ విభాగాల్లోనూ ఈ సాంకేతికతను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ సాంకేతికతతో అంతరిక్షంలోని వ్యోమగాములకు సర్జరీలు చేసే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read Health and Latest News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights