ఒకప్పుడు పెద్దగా చదువుకోని వాళ్లు, సమాజం పట్ల పూర్తి అవగాహన లేనివారు ఎక్కువగా మోసపోతూ ఉండేవారు. కానీ ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు వారు, వీరు అని లేదు. అందరూ మోసాలు బారిన పడుతున్నారు. కొందరు తెలియక నష్టపోతుంటే.. మరికొందరు అత్యాశతో జేబు గుల్ల చేసుకుంటున్నారు.
తాజాగా దక్షిణ ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు నకిలీ బంగారు నాణేలను విక్రయించి.. రూ.2.3 కోట్ల మేర మోసం చేసినందుకు డోంగ్రీ పోలీసులు అబ్దుల్ రవూఫ్, పమేష్ ఖిమావత్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. షేర్ ట్రేడింగ్‌లో ఖిమావత్ బాగా నష్టపోయాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అందుకే వాటి నుంచి బయటపడటానికి నకిలీ బంగారు నాణేల విక్రయానికి తెరలేపాడు. పోలీసుల విచారణలోనూ అతను ఇదే విషయాన్ని చెప్పాడు.
ప్రఖ్యాత స్విస్ బ్రాండ్ హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలను తక్కువ ధరకే విక్రయిస్తానని నిందితుడు బాధితుడికి వల వేశాడు. అతను నిజమేననుకుని 25 గోల్డ్ కాయిన్స్‌ను రూ.2.3 కోట్లకు కొనుగోలు చేశాడు. ఎక్కడా డౌట్ రాకుండా.. వాటిపై అంతర్జాతీయ బంగారు కంపెనీ హాల్‌మార్క్ వేశాడు నిందితుడు. అయితే ఇంటికి తీసుకెళ్లి.. తెలిసినవారితో ఆ నాణేలను పరీక్ష చేయించగా అవి ఫేక్ అని తేలింది. అవన్నీ వెండి నాణేలని.. వాటిపై బంగారు పూత వేసి ఇచ్చినట్లు బాధితుడు ధృవీకరించుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితులు ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…