బైసరన్ లోయ ఒకప్పుడు వచ్చీపోయే పర్యాటకులతో రోజంతా సందడిగా ఉండే అటవీప్రాంతం. కానీ ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. మంగళవారం టెర్రరిస్టుల తుపాకుల గర్జనలతో మార్మోగిన ప్రాంతంలో ఎటు చూసినా నాటి విషాదానికి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. టెర్రరిస్టుల నుంచి తప్పించుకునేందుకు భయంతో అటూ ఇటూ పరుగులు తీసిన పర్యాటకుల వస్తువులు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 22న దాదాపు వెయ్యిమందికి బైసరన్ లోయకి వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. మధ్యాహ్న సమయానికి పరిస్థితి అంతా మారిపోయింది. ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసంలో 26 మంది పర్యాటకులు చనిపోయారు.
ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై నెత్తుటి చారలు భీతావహంగా కనిపించాయి. అక్కడక్కడా పైన్ చెట్ల కొమ్మలపై రక్తపు మరకలు ఉన్నాయి. బైరసన్ లోయ నుంచి కింద 7 కిలోమీటర్ల దూరాన ఉన్న పహల్గామ్ పట్టణం వరకూ చెల్లాచెదురుగా పడిన వస్తువులు కనిపించాయి. భూతల స్వర్గం కాస్త ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. పచ్చికబయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై జరిగిన కాల్పులు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రస్తుతం టూరిజం ఆనవాళ్లే లేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అన్ని షాపులు మూసేసే కనిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..