భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల వరకు వర్షపు నీరు చేరి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇక వాహనదారుల గోస అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఆగకుండా కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయింది. అన్ని మార్గాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ ఓ ఆటోపై కూలి పడిపోయింది. కానీ, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్-సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ఆటోపై పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో అసలు ఏం జరిగిందో గుర్తించడానికే కాస్త సమయం పట్టింది.
ఆ ఆటోలో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలో గోడ కూలిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక మానదు. వర్షానికి ఆ నిర్మాణం మరింతగా తడిసిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఆ గోడను సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపడుతునట్లు తెలుస్తోంది. అందుకే భారీ వర్షానికి ఉన్నట్టుండి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. పైగా అదే సమయంలో ఆ మార్గంలో ఆటో వస్తుండడం, ఈ గోడ ఆటోపై కూలి పడిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. గాయపడినవారు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గోడ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.