Video: ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ PM.. పాల్గొన్న టీమిండియా లెజెండ్! వీడియో వైరల్

Written by RAJU

Published on:


న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తన భారత పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ప్రత్యేక సందర్భంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ఈ వినూత్న సంఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది, ఇందులో లక్సన్, కపిల్ దేవ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు అజాజ్ పటేల్, రాస్ టేలర్‌లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి లక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధానిలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో కొంతమంది చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడుతూ లక్సన్, కపిల్ తమ సమయాన్ని ఆనందంగా గడిపారు. స్లిప్ కార్డన్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన లక్సన్, తన చురుకైన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, రాస్ టేలర్, అజాజ్ పటేల్‌లను ఆశ్చర్యపరిచాడు.

ఈ సంఘటన గురించి ప్రధాన మంత్రి లక్సన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో (గతంలో ట్విట్టర్) కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫోటోల్లో టేలర్ యువ బౌలర్లపై విరుచుకుపడుతుండగా, లక్సన్ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. “కివీస్ కోసం విజయం సాధించడానికి భారతదేశంలో కష్టపడి పనిచేస్తున్నాను” అంటూ అజాజ్ పటేల్‌తో కలిసి పోస్ట్ చేసిన వీడియోకు లక్సన్ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. క్రికెట్ ప్రేమికులను అలరించిన ఈ సంఘటన క్రీడా ప్రపంచంలో మంచి చర్చనీయాంశంగా మారింది.

కేవలం క్రికెట్ ఆట మాత్రమే కాకుండా, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. వారిద్దరూ ఉమ్మడి ప్రెస్ మీట్‌లో సరదాగా చర్చించుకున్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో లక్సన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ గురించి చేసిన వ్యాఖ్య ప్రధానమంత్రి మోదీని నవ్వించింది. తన ప్రసంగంలో, “దౌత్యపరమైన సంఘటన” జరగకుండా ఉండేందుకు క్రికెట్ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మేనేజ్ చేశానని లక్సన్ సరదాగా వ్యాఖ్యానించారు.

దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. దీనికి సంబంధించి లక్సన్ మాట్లాడుతూ, “భారత్ చేతిలో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమిని ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం నాకు నిజంగా అభినందనీయం, అలాగే భారతదేశంలో మన టెస్ట్ విజయాల గురించి నేను ప్రస్తావించలేదు. దానిని అలాగే ఉంచి, దౌత్యపరమైన సంఘటనను నివారించుకుందాం” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, మోదీ దీనికి నవ్వుతూ స్పందించారు.

ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ మాజీ స్టార్ రాస్ టేలర్ కూడా హాజరయ్యాడు. రెండు దేశాల ప్రధాన మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణను చూసి, టేలర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ చర్చలు, గల్లీ క్రికెట్ పోటీలు కేవలం ఆటగాళ్లను మాత్రమే కాదు, క్రికెట్ ప్రేమికులను కూడా ఉల్లాసపరిచాయి. న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన భారత పర్యటనలో క్రికెట్ ద్వారా రెండు దేశాల మద్య మైత్రిని మరింత బలపరిచినట్లు కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification