ABN
, Publish Date – Mar 24 , 2025 | 05:00 AM
కట్టు కథలు అల్లి తనపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు.

చిలకలూరిపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కట్టు కథలు అల్లి తనపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. ఈ కేసు పెట్టినవారెవరో తనకు తెలియదని, ఎప్పుడూ వారితో మాట్లాడలేదని, చూడనూ లేదని ఆదివారమిక్కడ విలేకరులతో అన్నారు. వాళ్లు తనకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే తనపై ఏసీబీ కేసు నమోదైందని తెలిపారు. ఆయనకు తనపై ఎందుకో విపరీతమైన కోపమన్నారు. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబరు 2 వైఎస్ వర్ధంతి రోజున గురజాల సర్కిల్ డీఎస్సీపై, సీఐలిద్దరికి లంచాలిచ్చి.. నా ఫోన్ నంబరు. మా ఇంట్లో వాళ్ల నంబర్లు, సిబ్బంది నంబర్ల కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కాల్‌డేటా తీస్తారా… తన వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు రావాలనుకున్నారో అంతటి నీచమైన ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. విద్యుత్ చార్జీల అంశంపై చిలకలూరిపేటలో ధర్నా చేస్తే ఎమ్మెల్యే తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని ఆరోపించారు.
Updated Date – Mar 24 , 2025 | 05:01 AM