- ఆర్.ఎల్.ఐ.సి కి పర్యావరణ అనుమతికి నిరాకరించిన కేంద్రం
- కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం ఇది
- కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను వదులు కోము: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కే. ఆర్.యం.బి ,అపెక్స్ కౌన్సిల్ ల అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలి అన్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన తెలిపారు. అంతరాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను కుడా కాదని వారు ఈ ప్రాజెక్టు ను మొదలు పెట్టారన్నారు. అటువంటి కీలక సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను కాపాడేందుకు పునుకుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను నీటిపారుదల అధికారులు ఎన్.జి.టి,యం.ఓ ఎఫ్, సి.సి లతో పాటు కే.ఆర్.యం.బి,కే., కే.డబ్ల్యూ.డి.టి-2వద్ద పటిష్టమైన వాదనలు వినిపించినందునే ఈ విజయం సాధ్య పడిందన్నారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం చేపట్టడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించిన నేపద్యాన్ని ఆయన ఉటంకించారు. దీనితో ఈ.ఏ.సి, ఫిబ్రవరి 27 న జరిగిన 25 వ సమావేశంలో ఎన్.జి.టి ఉత్తర్వులను సమీక్షించి ఏ.పి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చుట్టినట్లు నిర్దారించుకున్న మీదటనే ఈ నిర్ణయం వెలువరించారన్నారు. అంతే కాకుండా పర్యావరణ అనుమతులు పొందాలి అంటే పూర్వ స్టితి తో పర్యావరణ అనుమతికి దరఖాస్తు పెట్టుకోవచ్చని స్పష్టం చేయడం తెలంగాణా రాష్ట్ర విజయంగా ఆయన అభివర్ణించారు.
ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండి ఉంటే తెలంగాణా రాష్ట్రంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సాగు,త్రాగునీటికీ దుర్భర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన మీదటనే కృష్ణా జలాశయాలలో మన హక్కు కోల్పోకుండా చూడడంతో పాటు ఆనధికారికంగా నీటి భద్రతకు ముప్పు వాటిల్ల కుండా విధాన పరమైన పోరాటం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.