వీధి చివర బడ్డీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అంతా యూపీఐని వాడుతున్నారు. ప్రజలు కూడా ఆ విధంగా అప్ డేట్ అయ్యారు. దీనిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా.. తక్కువ మొత్తాలలో లావాదేవీలు చేసే వారికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 2000 కన్నా తక్కువ ఉండే యూపీఐ లావాదేవీలపై ఈ ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొంది. అదే సమయంలో వినియోగదారులకు ఎలా ఫీజులు ఉండవని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ. 1500 కోట్లు విడుదల..
చిన్న వ్యాపారులే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వద్ద తక్కువ మొత్తాలలో జరిగే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిరు వ్యాపారులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారి కోసం రూ. 1500కోట్లను కేటాయించింది. రూ. 2,000 వరకూ పర్సన్ టు మర్చంట్(పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై వీటిని అందించనుంది. అంటే ఒక్కో లావాదేవీకి 0.15శాతం చొప్పున చిరు వ్యాపారులు ప్రోత్సాహకం పొందుతారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి మధ్య జరిగిన లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. రూ. 2,000పైన జరిగిన లావాదేవీలకు ఈ పథకం వర్తించదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నెలకు రూ. 50,000 కన్నా తక్కువ బిజినెస్ చేసే వ్యాపారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే చిరు వ్యాపారులు దీనిని కోసం క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా ఈ క్లయిమ్ లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదించాలని కేంద్రం సూచించింది. 80శాతం క్లయిమ్ లు ఎలాంటి అభ్యంతరాలు, షరతులు లేకుండా ఆమెదించాలని పేర్కొంది.
వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాక వారిని యూపీఐ వైపు ప్రోత్సహించినట్లు అవుతుంది. అదే సమయంలో సాధారణ పౌరులకు కూడా ఎలాంటి చార్జీలు లేకుండా సజావుగా చెల్లింపు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎండీఆర్ రేటు కూడా ఏం ఉండదని కేంద్రం ప్రకటించింది. రూపే కార్డు లావాదేవీలు, భీమ్ యూపీఐ లావాదేవీలకు ఈ ఎండీఆర్ ఏమి వసూలు చేయరని పేర్కొంది. దీని వల్ల సామాన్య వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి