Universities Posts: యూనివర్సిటీ పోస్టుల్లో ‘ఈడబ్ల్యూఎస్‌’ రచ్చ!

Written by RAJU

Published on:

  • కోటా అమలుపై జగన్‌ సర్కారు సొంత లెక్కలు

  • మిగిలిన పోస్టులు అన్‌రిజర్వు చేయాలన్న కేంద్రం

  • క్యారీ ఫార్వార్డ్‌ చేయాలని రాష్ట్రం సొంత నిర్ణయం

  • దాదాపు 120 పోస్టులు నష్టపోనున్న అభ్యర్థులు

  • అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ ఎలా?

  • 8 ఏళ్ల అనుభవం దాటితే లక్షకు మించి ఆదాయం

  • సమస్యగా రూ.8 లక్షల వార్షికాదాయం నిబంధన

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు వివాదాస్పదంగా మారుతోంది. ఈ కోటా అమలులో కేంద్రాన్ని కాదని జగన్‌ సర్కారు సొంత నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల వరకూ కోటా అమలు చేసినా అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు ఈ రిజర్వేషన్‌ అమలు చేయడం సాధ్యం కాదు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లేదా దానికి సమానమైన పోస్టులో కనీసం ఎనిమిదేళ్లు పనిచేసిన అనుభవం అవసరమని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక ప్రొఫెసర్‌ పోస్టులకైతే అసిస్టెంట్‌/ అసోసియేట్‌/ ప్రొఫెసర్‌ పోస్టుల్లో కనీసం పదేళ్లు పనిచేసి ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ వర్సిటీల్లో లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసినా అర్హులే. అయితే అసలు మెలిక ఇక్కడే ఉంది. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకొనేవారికి నెల జీతం రూ.లక్షల్లో ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ప్రారంభ వేతనమే రూ.57,700 ఉంది. ఈ పోస్టులో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారికి నెల జీతం దాదాపుగా రూ.లక్ష అవుతుంది. ఈ లెక్కన వారి వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటుతుంది. అలాగే ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు అసిస్టెంట్‌ లేదా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హోదాల్లో కనీసం పదేళ్లు పనిచేసి ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రారంభ జీతం రూ.1,31,100. పదేళ్ల తర్వాత వీరి జీతం రూ.1.6 లక్షలు పైమాటే. ఈ లెక్కన వారి వార్షికాదాయం దాదాపు రూ.20లక్షల వరకూ ఉంటుంది. కానీ దరఖాస్తుదారు కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు అర్హులు. ఓవైపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రూ.8 లక్షల లోపు వార్షికాదాయం కలిగి ఉండటం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి.

మిగిలిపోయే పోస్టులపై వివాదం

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు విషయంలో కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కోటా కింద కేటాయించిన పోస్టులకు సరిపడ అర్హులైన అభ్యర్థులు దొరక్కపోతే, వాటిని అదే సంవత్సరంలో తిరిగి ఈడబ్ల్యూఎ్‌సలో భర్తీ చేయాలని పేర్కొంది. అంతేగానీ తర్వాత ఏడాదికి క్యారీ ఫార్వార్డ్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే రెండోసారి కూడా మిగిలిపోతే వాటిని అన్‌రిజర్వ్‌ కోటాలో భర్తీ చేయాలని తెలిపింది. అయితే మిగిలిపోయిన పోస్టులు క్యారీ ఫార్వార్డ్‌ అవుతాయని తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లలో వర్సిటీలు తెలిపాయి. దానివల్ల ఓపెన్‌ కేటగిరీలో పోటీపడే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈడబ్ల్యూఎస్‌ కోటా… ఓపెన్‌ కేటగిరీ నుంచే ఉత్పన్నమవుతుంది. ఫలితంగా ఓసీ కోటా 10శాతం తగ్గిపోతుంది. ఈడబ్ల్యూఎ్‌సలో మిగిలిపోయిన పోస్టులనైనా అన్‌ రిజర్వ్‌(ఓసీ)లో చూపిస్తే ఓసీ అభ్యర్థులకు కొంత మేలు జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం అమలుకాని రిజర్వేషన్‌నే వర్తింపజేస్తామని పట్టుబట్టింది.

ఇటీవల జమ్ము కశ్మీర్‌లో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లలో అక్కడి ప్రభుత్వం నిరుద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పోస్టులు మిగిలిపోతే వాటిని అన్‌రిజర్వ్‌లో భర్తీ చేస్తామని స్పష్టంగా తెలిపింది. దీనిపై ఇక్కడి ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి, సీఎంవో అధికారులకు కొందరు అభ్యర్థులు సమాచారం ఇచ్చారు. అయినా సరే నిబంధనలు మార్చలేమంటూ ఉన్నత విద్యాశాఖ మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడు భర్తీ చేయబోతున్న పోస్టుల్లో ప్రొఫెసర్‌- 418, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-801 పోస్టులున్నాయి. వీటిలో 10 శాతం అంటే 120 పోస్టులను అభ్యర్థులు నష్టపోనున్నారు. కాగా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కేవలం ప్రారంభ దశ ఉద్యోగాలకే వర్తిస్తుందని, ఆ తర్వాత హోదాలకు అమలుకాదని కొందరు అభ్యర్థులు వాదిస్తున్నారు. యూనివర్సిటీల్లోని టీచింగ్‌ పోస్టుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు మాత్రమే ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు అమలుచేయడం కోటా నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.

మొదటినుంచీ నిర్లక్ష్యమే

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై జగన్‌ ప్రభుత్వం తొలినుంచీ నిర్లక్ష్యంగానే ఉంది. ఈ ప్రభుత్వంలో పెద్దసంఖ్యలో సృష్టించిన సచివాలయాల ఉద్యోగాల భర్తీ సమయంలో ఈ కోటాను అమలుచేయలేదు. సచివాలయాల ఉద్యోగాల్లో దీన్ని అమలుచేసి ఉంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించేవి. అప్పుడు నిర్లక్ష్యం చేసి, పెద్దగా ఉద్యోగాలు లేనప్పుడు ఈ రిజర్వేషన్లు అమలుచేస్తామని చెబుతోంది.

Updated Date – 2023-11-03T11:09:08+05:30 IST

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights