Transfers: బదిలీలు ఉన్నట్టా? లేనట్టా? తర్జనభర్జనలో టీచర్లు!

Written by RAJU

Published on:

రేపే జీవో అన్న హామీకి రెండు వారాలు

టీచర్ల ఎదురుచూపులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సిఫారసు బదిలీల కోసం నిలిపివేత

తర్జనభర్జనలో ఉపాధ్యాయులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల(Teachers transfers)పై సందిగ్ధత కొనసాగుతోంది. బదిలీలు జరుగుతాయని ఇటీవలి వరకు చెబుతూ వచ్చిన ప్రభుత్వం గత రెండు వారాలుగా దీనిపై మౌనం వహించింది. దీంతో ఇక ఇప్పుడు బదిలీలు ఉండవేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు ఎందుకని సీఎం జగన్‌(Cm jagan) కూడా ప్రశ్నించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పాఠశాల విద్యాశాఖ(School Education Department) ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 10 రోజుల కిందటి వరకు ఎప్పటికప్పుడు బదిలీల జీవో ఇస్తామంటూ హడావిడి చేసిన ప్రభుత్వం ఎందుకో ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. రెండు వారాల కిందట ఓ ప్రెస్‌మీట్‌లో రేపే బదిలీల జీవో ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అంతకముందు ఆయన్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలతోనూ జీవో విడుదల చేయబోతున్నామని హామీలు ఇచ్చారు. కానీ, ఎన్నిసార్లు హామీలు ఇచ్చినా.. ఉత్తర్వులు మాత్రం విడుదల కావలేదు. కాగా ఇటీవల సిఫారసు బదిలీల వ్యవహారం తెరపైకి వచ్చింది. 200 మందికి పైగా ఉపాధ్యాయులను సిఫారసుల ద్వారా ప్రభుత్వ స్థాయిలో బదిలీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. సీఎంవో స్థాయిలోనే జరిగిన ఈ సిఫారసు బదిలీల పట్ల ప్రభుత్వంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు 2 లక్షల మంది టీచర్లు బదిలీల కోసం ఎదురుచూస్తున్న సమయంలో 200 మందిని ముందుగానే బదిలీ చేస్తే చెడ్డపేరు మాత్రం వస్తుందని ప్రభుత్వంలోని ఓ వర్గం వాదిస్తోంది. కానీ, ఎట్టి పరిస్థితుల్లో బదిలీలు చేసి తీరాలని సిఫారసులు చేసిన నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందిగ్ధత నేపథ్యంలో మొత్తం బదిలీలను ప్రభుత్వం అటకెక్కించిందనే వాదన వినిపిస్తోంది. న్యాయ సలహాలు, ఆర్థిక ఆమోదాలు అన్నీ వచ్చేసిన తర్వాత సాంకేతికంగా బదిలీల జీవో విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు. అయినా ప్రభుత్వం జీవోపై ఎందుకు తాత్సారం చేస్తోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

పదోన్నతులు దక్కిన వారినెలా?

పదోన్నతులు దక్కిన వారిని ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సుమారు 3వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. దీంతో వారి కోసమైనా బదిలీలు చేయక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, గత రెండు వారాల నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తుంటే ఇప్పట్లో బదిలీలు ఉండవని స్పష్టమవుతోంది. ఇక విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు ఎందుకులే అని ప్రభుత్వం భావిస్తుందోనే ప్రచారం పెరిగిన నేపథ్యంలో దీనికి మరింత బలం చేకూరింది. మరోవైపు, బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత రెండు నెలల నుంచి ఎవరికి ఏ స్థానం వస్తుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం పదే పదే బదిలీలు చేస్తామని హామీలు ఇవ్వడంతో అది బోధనపై ప్రభావం చూపుతోంది. బదిలీలు చేయకపోతే అది ప్రకటించాలని, ఇలా నెలల తరబడి వాయిదాలు వేయడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights