ఏకసభ్య కమిషన్‌కు నాటి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ విజ్ఞప్తి
తొక్కిసలాట ఘటనలో ముగిసిన మూడవ దశ విచారణ
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ ఉద్యోగిగా ఎన్నో బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు చూసుంటారు. అలాంటిది వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం పెద్దయెత్తున భక్తులు వస్తారు కదా.. మరి ఎలా పార్కులోకి పంపించేశారు..? అది మీ నిర్ణయమా, టీటీడీ నిర్ణయమా, పోలీసు శాఖ నిర్ణయమా? అసలు అది హోల్డింగ్ పాయింట్ కాదు కదా’ అని తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. తిరుపతి కలెక్టరేట్లో శనివారం కూడా తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా హరినాథరెడ్డిని విచారించారు. ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో భక్తులకు టోకెన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే పార్కులోకి ఎందుకు పంపించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అంతమంది భక్తులు ఒకచోట గుమికూడినపుడు గేటు తాళాలు ఎందుకు తీశారు? మీరు ఆ సమయంలో అక్కడున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే భక్తులను పార్కులోకి పంపి హోల్డ్ చేసిన నిర్ణయం తనది కాదని కమిషన్ దృష్టికి హరినాథరెడ్డి తీసుకెళ్లినట్టు తెలిసింది. జనవరి 8వ తేదీ రాత్రి విధుల్లో ఉన్న విజిలెన్సు సిబ్బందిని కూడా కమిషన్ విచారించింది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది. ఎందుకు గేటు తీయాల్సి వచ్చింది అని ఆరా తీసింది. అయితే ఈ ఘటనలో సస్పెండైన నాటి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ మాత్రం ‘సార్.. నేను విచారణకు సంసిద్ధం కావాల్సి ఉంది. కొంత సమయం కావాలి’ అని కమిషన్ చైర్మన్‌కు విన్నవించుకున్నారు. టీటీడీ పూర్వ సీవీఎస్వో శ్రీధర్ కూడా ఘటనపై అఫిడవిట్ సమర్పించారు. కాగా, ఈ నెల 15న కమిషన్ మూడవ దశ విచారణ తిరుమల నుంచి ప్రారంభించిన విషయం విదితమే. శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్ల నిర్వహణను పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు, ప్రస్తుత ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, నాటి ఎస్పీ సుబ్బరాయుడు, పూర్వ సీవీఎస్వో శ్రీధర్, అప్పటి జేఈవో గౌతమితో పాటు సుమారు వందమంది గాయపడిన బాదితులు, టీటీడీ ఉద్యోగులు, పోలీసులను విచారించారు. ఇక నాలుగో దశ విచారణ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News