Tirupati-Palani: గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువ ధరకే.. – Telugu Information | Tirupati Palani Pilgrimage Made Simpler: New Luxurious Bus Service Begins

Written by RAJU

Published on:

తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర చేపట్టాను. యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని, రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు బాలాజీ, సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందించారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా… ఆ మురగన్ ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి లభించింది.

505 కిలోమీటర్లు… 680 రూపాయలు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తిరుపతి- పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ రెండు బస్సులు మొదలవుతాయి. 505 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 11 గంటలపాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటల సమయంలో పళని చేరుకుంటుంది. అలాగే పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు తిరుపతికి ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించాం. పెద్దలకు రూ.680, చిన్నపిల్లలకు రూ. 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందఅని అన్నారు.

ఇవి కూడా చదవండి

భక్తుల అభీష్టం మేరకు బస్ సర్వీసు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “తిరుపతి – పళని రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భక్తుల అభీష్టం మేరకు ఈ సర్వీసును అందించడం వల్ల అందరికీ మేలు కలుగుతోంది. రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights