3 నెలల్లో వంద ఆవులు మృతి: భూమన
అబద్ధమైతే రాజకీయాల నుంచి
తప్పుకుంటారా?.. భానుప్రకాశ్‌రెడ్డి సవాల్
గత 3 నెలల్లో ఒక్క ఆవే అనారోగ్యంతో
చనిపోయింది: బ్రాహ్మణ సాధికార సమితి
ఆవుల మృతి ప్రచారం అవాస్తవం: టీటీడీ
తిరుపతి(జీవకోన)/తిరుమల/అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకనే ఇక్కడి గోశాలలో 3 నెలల్లో వందకుపైగా గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో అర్థం కావడంలేదన్నారు. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలన్నారు. స్వామి క్షేత్రంలో జరుగుతున్న ఈ సంఘటనలపై హైందవ ధర్మ పరిరక్షకులు ప్రశ్నించాలని కోరారు. కాగా, గోవులు మృతి చెందాయంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ భూమనకు టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి సవాల్ విసిరారు.
గోవుల మృతి వార్తలు అవాస్తవం: టీటీడీ
టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ‘మృతిచెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు చెందినవి కావు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొద్దిమంది దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని కోరుతున్నాం’ అంటూ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో టీటీడీ వివరణ ఇచ్చింది.
గోమాతతో రాజకీయాలా?
‘గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అలాంటి ఆవును కూడా వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుతున్నారు. టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయంటూ భూమన అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ గోశాలలో 2,668 గోవులు ఉన్నాయని, వాటిని ప్రతిరోజూ అధికారులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. గత 3 నెలల్లో ఒక్కటి మాత్రమే అనారోగ్యంతో మృతి చెందిందన్నారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: లోకేశ్
టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంత్రి లోకేశ్ ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం దుర్మార్గమని, దీన్ని భక్తులు ఎవ్వరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.