Tirumala: శ్రీవారి దర్శన టోకెన్లు వృద్ధులకు ఆఫ్‌లైన్‌లోనూ

Written by RAJU

Published on:

  • పాత విధానం పునరుద్ధరణకు టీటీడీ బోర్డు తీర్మానం

  • త్వరలో అమలుకు అధికారుల ప్రణాళికలు

  • పూర్వపు పద్ధతిలోనే వీఐపీ బ్రేక్‌!

  • ఉదయం 5.30గంటలకు మార్చాలని టీటీడీ నిర్ణయం

  • సాధ్యాసాధ్యాలపై ఈవారంలోనే ట్రయల్‌ రన్‌

తిరుమల, మార్చి 31(ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆఫ్‌లైన్‌ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్‌లైన్‌ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కొవిడ్‌ ముందు వరకు రోజుకు 1,400 మందికి దర్శనం చేయించేది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మందికి కరెంట్‌ బుకింగ్‌ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్‌ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండడంతో కొవిడ్‌ సమయంలో గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంట్‌ బుకింగ్‌ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటి నుంచి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్‌ను రద్దు చేసి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్లిపోతున్నారు. పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సందర్భాలూ ఉన్నాయి.

3 నెలల తర్వాత ఆఫ్‌లైన్‌ విధానం

ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించారు. వృద్ధులు, దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం సరికాదని, చాలా మందికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ తెలియదని గ్రహించారు. ఆఫ్‌లైన్‌లోనూ టోకెన్లు జారీ చేయాలని గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. కాగా, రానున్న 3 నెలలకు సీనియర్‌ సిటిజన్ల టోకెన్ల జారీప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తయింది. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ విధానం అమలు చేసేలా అఽధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి?అనే అంశాలపై 2-3 వారాల్లో నిర్ణయించనున్నారు.

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మార్పుపై వారాంతంలో ట్రయల్‌ రన్‌

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్‌ రన్‌ నిర్వహించనుంది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం 5.30 గంటలకు కేటాయించేవారు. అయితే రాత్రివేళల్లో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్‌ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉదయం కల్యాణోత్సవం, ఉదయం టైంస్లాట్‌లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్‌ను తిరిగి పూర్వపుపద్ధతిలో వేకువజాము 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే బోర్డు ఆదేశం మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా రానున్న శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్‌రన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

  • పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా..

  • రేపు సీఎంతో టీటీడీ అధికారుల భేటీ

  • గత ప్రభుత్వ నిర్ణయాలు, భక్తుల సౌకర్యాలపై సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిస్థాయి ప్రక్షాళనతో పాటు అభివృద్ధి, భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై బుధవారం టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడితో పాటు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అధికారులు విజయవాడలో సీఎంతో సమావేశమై గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు. గతంలో హడావుడిగా, అనవసరంగా కోట్లాది రూపాయలతో నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనధికారికంగా వెలసిన దుకాణాలు, టీటీడీలో ఇప్పటికీ పాతుకుపోయిన అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై చర్చించనున్నారు. పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది. ఇక, అన్యమతస్తులను వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని ఇప్పటికే టీటీడీతో పాటు ఇటీవల దర్శనంకోసం వచ్చిన సీఎం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని కూడా సీఎంతో చర్చించనున్నారు. అన్నప్రసాదాల నాణ్యత పెంపు, గ్రామీణ ప్రాంతాలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న నూతన ట్రస్టు, అలిపిరిలో శ్రీవారి కొండల వెంబడి ఉన్న ప్రాంతాలను టెంపుల్‌ కారిడార్‌గా ఏర్పాటు చేయడంతో పాటు ఒబెరాయ్‌ హోటల్‌కు మరోప్రాంతాన్ని కేటాయించడం, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి వివిధ అంశాలపై చర్చించనున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపైనా చర్చ జరగనుందని తెలిసింది.

చెన్నైలోని రాజపాళయం ఆలయ పరకామణిలో గోల్‌మాల్‌పై విచారణకు ఆదేశించినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. విదేశీ కరెన్సీ లెక్క చెప్పకుండానే టీటీడీకి రికార్డులు పంపడంపై…‘రాజపాళయం ఆలయ పరకామణిలో గోల్‌మాల్‌!’ శీర్షికన మార్చి21న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. ఈవో శ్యామలరావు కూడా స్పందిస్తూ ఆరోపణలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Read Latest AP News And Telugu News

Updated Date – Apr 01 , 2025 | 05:36 AM

Subscribe for notification
Verified by MonsterInsights