
రంజాన్ రోజు తిరుపతిలో ముస్లిం వ్యక్తి చేసిన తిరుమల ప్రయాణం అలజడి సృష్టించింది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ ఆపకుండా వెళ్లిన వ్యక్తి టోపీ ధరించిన ముస్లిం యువకుడిగా భావించి అలిపిరి సెక్యూరిటీ అప్రమతమైంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్‌లోని అలిపిరి వద్ద సప్తగిరి తనిఖీ కేంద్రం ఉండగా తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంటుంది. 14 లైన్ల సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రంలో మధ్యలో రెండు వరుసలు బైక్‌లు వెళ్లేందుకు ప్రత్యేక లైన్స్ ఉన్నాయి. అయితే మార్చి 31, సోమవారం ఉదయం 6:15 గంటల సమయంలో టోల్‌గేట్‌లో వివిఐపీలు వెళ్లేందుకు ఉన్న లైన్‌లో టోపీ ధరించిన వ్యక్తి వేగంగా దూసుకెళ్లాడు.
టోల్‌గేట్ ముందే స్పెషల్ టాస్క్‌పోర్స్ టీమ్ చెక్ పాయింట్ ఉంది. అక్కడ విధుల్లో సెక్యూరిటీ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా అతను బైక్‌పై స్పీడ్‌గా దూసుకెళ్లాడు.
బైక్ ఆపకుండా తిరుమలకు దూసుకెళ్లి ముస్లిం వ్యక్తి వినాయక స్వామి ఆలయం వద్ద విజిలెన్స్ గార్డు నిలువరించే ప్రయత్నం చేశాడు.
అయినా ఆపకుండా తిరుమలకు వెళ్లిన వ్యక్తిని ఎట్టకేలకు విజిలెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. జీఎన్సీ టోల్‌గేట్ వద్ద పట్టుబడ్డ వ్యక్తి తిరుపతి లోని సింగాలగుంటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని టూ వీలర్‌ను సీజ్ చేసి తిరిగి అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. తిరుమల టూ టౌన్ సీఐ తో పాటు టిటిడి విజిలెన్స్ అధికారులు అతడిని విచారించారు. ఆ వ్యక్తి మానసిక స్థితి బాగాలేదన్న అనుమానంతో వైద్య పరీక్ష ల కోసం తిరుపతి రుయా ఆసుపత్రి కి తరలించారు. ఉదయం 6.15 సమయంలో అలిపిరి టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘటనపై టిటిడితోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తిరుమల 2 టౌన్ సీఐ రాముడుతో పాటు విజిలెన్స్ సిబ్బంది తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తిని విచారించారు. అతని భార్య, పిల్లలను కూడా పిలిపించి పోలీసులు
విచారించారు. మరోవైపు టిటిడి భద్రతా వైఫల్యం పై విమర్శలు వ్యక్తం కాగా ఘటనపై పోలీసులు స్పందించ లేదు.
NOTE: సదరు ముస్లిం వ్యక్తికి మానసిక సమస్యలు ఉన్నాయన్న అనుమానాలతో అతని ఫోటోను అందుబాటులో ఉంచడం లేదు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.