TIMS Hospitals: సర్కారీ స్పెషాలిటీ | Telangana Authorities to Convert TIMS Hospitals into Tremendous Specialty Facilities

Written by RAJU

Published on:

రాజధానిలో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

సనత్‌నగర్‌లో కార్డియాక్‌, కార్డియోథొరాసిక్‌

ఎల్బీనగర్‌లో న్యూరాలజీ, న్యూరోసైన్స్‌

అల్వాల్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషాలిటీ

ఒక్కో టిమ్స్‌నూ ఒక్కో స్పెషాలిటీ ఆస్పత్రిగా

తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

జూన్‌నాటికి అందుబాటులోకి సనత్‌నగర్‌ టిమ్స్‌

మిగిలిన రెండూ ఈ ఏడాది చివరినాటికి

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్‌ ఆస్పత్రులే. చాలా తక్కువగా స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. క్యాన్సర్‌ రోగులకు ఎంఎన్‌జే, చిన్నారుల కోసం నీలోఫర్‌, మానసిక రోగుల కోసం మెంటల్‌ ఆస్పత్రి, క్షయ రోగులకు టీబీ ఆస్పత్రి వంటివే ఉన్నాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌

(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆస్పత్రులను మూడు స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టిమ్స్‌ను ఒక్కో స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌లో కార్డియాక్‌, కార్డియోథొరాసిక్‌, అల్వాల్‌ టిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎల్బీనగర్‌ టిమ్స్‌ను న్యూరాలజీ, న్యూరోసైన్స్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాలను జనరల్‌ ఆస్పత్రులుగా కొనసాగించనున్నారు. ఆ రెండు ఆస్పత్రుల్లో ఉన్న కార్డియాక్‌, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించనున్నారు. ఆ మూడు.. మూడు రకాల స్పెషాలిటీలుగా మారబోతున్న నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న సూపర్‌ స్పెషాలిటీ విభాగం వైద్యులను అక్కడికి పంపనున్నట్లు ఉన్నతాఽధికారులు తెలిపారు. అలాగే కుత్బుల్లాపూర్‌ వైద్య కళాశాలకు అనుబంధ ఆస్పత్రిగా అల్వాల్‌ టిమ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రిగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కొనసాగుతోంది. అల్వాల్‌ టిమ్స్‌ అందుబాటులోకి రాగానే కుత్బుల్లాపూర్‌ వైద్యకళాశాల బోధనాస్పత్రిగా మారనుంది. ఇక మహేశ్వరం వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రిగా ఎల్బీనగర్‌ టిమ్స్‌ కొనసాగనుంది. ప్రస్తుతం వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రినే దాని అనుబంధ ఆస్పత్రిగా చూపుతున్నారు. ఎల్బీనగర్‌ టిమ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్నే మహేశ్వరం బోధనాస్పత్రిగా చూపనున్నారు. ఈ రెండు బోధనాస్పత్రులకు నర్సింగ్‌ సిబ్బంది కొరత ఉండదని, కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉండబోదని వైద్యవిద్య అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చోట 60 సీట్లతో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల ఉంటుంది. దాంతో ఒక్కో బోధనాస్పత్రిలో 240 మంది నర్సులు అందుబాటులో ఉంటారని ఉన్నతాఽఽధికారులు వెల్లడించారు.

మానవ వనరులకు ప్రతిపాదనలు

మూడు టిమ్స్‌లను ఒక్కో దాంట్లో వెయ్యి పడకలతో నిర్మిస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగా వైద్య సేవలు అందించాల్సిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా స్పెషలిస్టు వైద్యులను నియమించుకోవాల్సివుంటుంది. ఆమేరకు ఒక్కోచోట అదనంగా ఎంతమంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సహాయక సిబ్బంది అవసరమవుతారో ఇప్పటికే వైద్యవిద్య సంచాలకులు లెక్కలు వేశారు. వారి నియామకానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని ఇటీవలే ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే, ఆ వైద్య సిబ్బంది నియామక బాధ్యతను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అప్పగించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్‌ 2 నాటికి సనత్‌ నగర్‌ టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ మూడు టిమ్స్‌లను ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో శరవేగంగా నిర్మిస్తున్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ను మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌ను లార్సెన్‌ అండ్‌ టూబ్రో, అల్వాల్‌ టిమ్స్‌ను డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్టు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తోంది.

ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date – Apr 01 , 2025 | 04:23 AM

Subscribe for notification
Verified by MonsterInsights