Thirst: ఎంత నీరు తాగుతున్నా దాహంగా ఉంటోందా? కారణాలు ఇవే!

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: ఎంత నీరు తాగుతున్నా దాహం తీరట్లేదంటే ఆశ్చర్యంగానే కాకుండా చిరాకుగా కూడా ఉంటుంది. వాస్తవానికి దాహం వేస్తోందంటే శరీరంలో నీరు తగ్గిందని అర్థం. ఎక్సర్‌సైజులు చేసిన తరువాత లేదా ఏదైనా కారంగా ఉన్న ఫుడ్ తిన్నప్పుడు నీరు తాగాలనిపించడం సహజమే. కానీ అతిగా దాహం వేస్తోందంటే అంతర్లీనంగా ఏదో అనారోగ్య సమస్య ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Health).

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

డీహైడ్రేషన్..

శరీరంలో చేరే నీరు కంటే ఎక్కువ మొత్తం బయటకి పోతే దాన్ని వైద్య పరిభాషలో డీహైడ్రేషన్ అంటారు. అధిక శారీరక శ్రమ చేసినప్పుడు నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. డయేరియా, వాంతులు వంటి ఇతర కారణాలు కూడా డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి. దీంతో, ఎంత నీరు తాగినా దాహం వేస్తున్నట్టు అనిపిస్తుంది.

డయాబెటిస్ వ్యాధితో బాధపడే వాళ్లల్లో అతిగా దాహం వేయడంతో పాటు (పాలీడిప్సియా), పలుమార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది (పాలీయూరియా). రక్తంలో అధికంగా ఉన్న చక్కెరను శరీరం మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అలాంటప్పుడు, గ్లూకోజ్‌తో పాటూ నీరూ బయటకుపోతుంది. దీంతో, డీహైడ్రేషన్ తలెత్తి నిరంతరం దాహంగా అనిపిస్తుంది.

ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్

శరీరంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి లవణాల మధ్య సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు కూడా దాహం మొదలవుతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్నప్పుడు సోడియం స్థాయిలు పెరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు శరీరంలో తగినంత నీరు ఉన్నా కూడా దాహంగా అనిపిస్తుంది. కాబట్టి, లవణాల మధ్య సమతౌల్యాన్ని పునరుద్ధరించేందుకు పొటాషియం అధికంగా ఉన్న అరటి, పాలకూర వంటివి తింటే పరిస్థితి అదుపులోకి వస్తుంది.

Diabetes in Women: డయాబెటిస్ ముప్పు! మహిళల్లో కనిపించే ప్రత్యేక రోగ లక్షణాలు ఇవే!

ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినే వాళ్లల్లో తరచూ దాహం వేస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కారణంగా ఆస్మోటిక్ ప్రెజర్ పెరిగి కణాల్లోని నీరు బయటకొచ్చి రక్తంలో కలుస్తుంది. ఆ తరువాత కిడ్నీలు దాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపించేస్తాయి. దీంతో, తేమ శాతం తగ్గి డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా ఎడతెగకుండా దాహం వేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బీపీ ఎక్కువగా ఉన్న వారికి ఇచ్చే డైయూరెటిక్ మందుల కారణంగా మూత్ర విసర్జన ఎక్కువై తరచూ దాహం వేస్తుందట. ఇక యాంటీకోలినెర్జిక్ డ్రగ్స్ వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గి నోరెండిపోయి దాహం వేస్తుంది.

Latest and Health News

Subscribe for notification
Verified by MonsterInsights