TGPSC Group 3 Top Ranker: గ్రూప్‌ 3లో మెరిసిన మెదక్‌ బిడ్డ అర్జున్‌రెడ్డి.. సొంత ప్రిపరేషన్‌తో టాప్‌ ర్యాంక్‌ – Telugu News | TGPSC Group 3 Rankers List 2025: Kukunuri Arjun Reddy from Medak district secured state 1st rank in TGPSC Group 3 results

Written by RAJU

Published on:

మెదక్ మార్చి 16: తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన కుకునూరి అర్జున్‌రెడ్డి 339.239 మార్కులతో గ్రూప్‌ 3 టాపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా తాజాగా విడుదలైన గ్రూప్ 2 లోనూ 413 మార్కులు సాధించి రాష్ట్ర 18వ ర్యాంకు సాధించాడు. ఈసీఈ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అర్జున్ రెడ్డి.. 2014లో వీఆర్వోగా ఎంపికై.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం మెదక్‌ కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సొంతంగా పరీక్షలకు సన్నద్ధమైన అర్జున్ రెడ్డి గ్రూప్స్‌ పరీక్షల్లో వరుసగా ర్యాంకులు కొట్టి అందరినీ అబ్బురపరిచాడు.

మెదక్‌ గ్రంథాలయాన్నే శిక్షణ కేంద్రంగా మలుచుకుని, పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచిన అర్జున్‌ రెడ్డి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అర్జున్‌ రెడ్డి గ్రూప్‌ 2 పోస్టుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. కాగా అర్జున్‌రెడ్డి తండ్రి నరేందర్‌రెడ్డి మెదక్‌ లైబ్రరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శోభ గృహిణి. తమ్ముడు అరుణ్‌రెడ్డి మెదక్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా మొత్తం 1388 గ్రూప్‌ 3 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 5,36,400 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,67,921 మంది మూడు పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 18,364 మందిని ఇన్‌వ్యాలీడ్‌గా టీజీపీఎస్సీ ప్రకటించింది. మిగతా 2,49,557 మంది జనరల్‌ ర్యాంకింగ్‌ వివరాలను కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. తాజా పలితాల్లో పరీక్ష రాసిన అభ్యర్థుల మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌తోపాటు ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని ఏప్రిల్‌ 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా సమస్యలుంటే పనివేళల్లో ఫోన్‌ 040-23542185, 23542187 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జనరల్‌ ర్యాంకింగ్స్‌ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారని కమిషన్‌ కార్యదర్శి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification