హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల మెయిన్స్ పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం (మార్చి 10) విడుదల చేయనుంది. అయితే ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో కేవలం మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కుల వివరాలను మాత్రమే టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అయినప్పటికీ.. మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
టీజీపీఎస్సీ అభ్యర్థులు మార్కులను ప్రకటించిన తరువాత ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్నవారి నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుదారుల పేపర్లలలోని మార్కులను అధికారులు మరోసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత చేపట్టిన మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలు ఇవే కావడంతో.. నిరుద్యోగులు ఆతృతగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఇక మార్చి 11 (మంగళవారం) గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14 (శుక్రవారం)న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే బ్యాక్‌లాగ్ ఉండవని కమిషన్ నిర్ణయించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.