హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యను ఒక్క సంతకంతో ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 కూడా జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. దీని ప్రకారం మొత్తం మూడు దశల్లో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలకమండళ్ల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్, రోస్టర్ విధానాలను కచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరచాలి. 1:10 నిష్పత్తిలో అంటే ఒక్కోపోస్టుకు 10 మంది చొప్పున రెండోదశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అయితే మొత్తం ఖాళీల్లో కేవలం సగమే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
నియామక ప్రక్రియలో మూడు దశలు ఇవే..
తొలిదశలో అకడమిక్ రికార్డ్, పరిశోధన ప్రదర్శన ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయిస్తారు. రెండో దశలో విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులో 30 మార్కులు కేటాయిస్తారు. ఇక చివరి దశ అయిన ఇంటర్వ్యూకి 20 మార్కులుంటాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం మూదో దశలో అంచనా వేసి మార్కులిస్తారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 2,817 మంజూరు పోస్టులున్నాయి. వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1524 ఉండగా.. వాటిల్లో ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీ ఏర్పడుతుంది. ప్రస్తుతం సర్కార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. అందులోనూ మొత్తం ఒకేసారి భర్తీ చేయకుండా.. కేవలం సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడంలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాధానం వస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.