హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తై దాదాపు నెల రోజులవుతున్నా ఫలితాల వెల్లడిపై పత్తా లేకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్‌తోపాటు పదో తరగతి ఫలితాలు కూడా విడుదలైనాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు జారీ చేయగా.. టెన్త్ ఫలితాలు కూడా విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది.
ఇందుకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. అందిన సమాచారం మేరకు ఈ నెలాకరు నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే నాలుగైదు రోజుల్లోనే ఫలితాలు వెల్లడికానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారులు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినందున విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి దస్త్రం పంపింది. దాన్ని ఉన్నతాధికారులు సీఎం ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. సీఎం ఆమోదం లభిస్తే ఈ నెలాకరుకే ఫలితాలు వచ్చేస్తాయన్నమాట.
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ సెండ్ చేస్తే చాలు.. మీ ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.