Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్‌‌కు నూతన సొబగులు

Written by RAJU

Published on:

అమృత్‌ భారత్‌ పథకంతో అభివృద్ధి

మెరుగైన వసతులకు రూ.27.70 కోట్లు

తెనాలి అర్బన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : తెనాలి రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్‌ భారత్‌ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.27.70 కోట్లతో ప్లాట్‌ఫారంల అభివృద్ధి, మూడవ వంతెన, ఎస్కలేటర్లు, లిఫ్టులు, అధునాతన టాయిలెట్లు, ఏసీ వెయిటింగ్‌ హాలు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఢిల్లీ, హౌరా-చెన్నై మార్గంలో ప్రధానమైన తెనాలి రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్యం 160 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. 88 రైళ్లు ఆగే ఈ స్టేషన్‌ నుంచి రోజు 17 వేల మంది ప్రయాణిస్తుండగా టిక్కెట్ల ఆదాయంపైనే రోజు రూ.3 లక్షలు వస్తాయి.

మెయిన్‌ లైన్‌గా రెండవ ఫ్లాట్‌ఫారం

పెరిగిన ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండవ ప్లాట్‌ఫారం మెయిన్‌ లైనుగా మార్చుతున్నారు. మలుపుల కారణంగా 140 కి.మీ వేగంతో వెళ్లాల్సిన రైళ్లు 90 కి.మీ వేగంతో వెళుతున్నాయి. ఈ కారణంగా ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇందుకోసం వేగం పెంచేందుకు రెండవ ప్లాట్‌ఫా రం మెయిన్‌లైన్‌గా మార్చి అభివృద్ధి చేస్తున్నారు.

12 మీటర్ల వెడల్పులో విశాలమైన బ్రిడ్జి

రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే రెండు వంతెనలు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 12 మీటర్ల వెడల్పులో మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. స్టేషన్‌ తూర్పు వైపు నుంచి పడమర వైపు బుకింగ్‌ వరకు విశాలమైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బ్రిడ్జిపైన ట్రైన్‌ వచ్చే వరకు వేచి ఉండేందుకు అవసరమైన కుర్చీలు, దుకాణాలు కూడా ఏర్పాటు కానున్నాయి. ప్రతి ఫ్లాట్‌ఫారం చేరేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు.

అధునాతన వెయిటింగ్‌ రూమ్‌

ఇప్పటి వరకు తెనాలి రైల్వేస్టేషన్‌లో సరైన వెయిటింగ్‌ రూమే లేదు. దీంతో ప్రయాణికులు రైళ్ల కోసం ప్లాట్‌ఫారంలపైనే దోమల బాధ భరిస్తూ వేచి ఉంటున్నారు. 1వ ప్లాట్‌ఫారంపై అధునాతన వెయిటింగ్‌ రూమ్‌ నిర్మిస్తున్నారు. రిజర్వేషన్‌ కౌంటర్‌ పక్కనే ఏసీ వెయిటింగ్‌ హాలు నిర్మాణం చేపట్టారు. 1వ ప్లాట్‌ఫాంపై అధునాతన పద్దతిలో టాయిలెట్స్‌ నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే అంధులు రైలు ఎక్కేందుకు మరొకరి సాయం లేకుండా మార్గం ఏర్పాటు చేస్తున్నారు. వారు గుర్తించేందుకు వీలుగా ఫ్లోరింగ్‌లో అవసరమైన టైల్స్‌ నిర్మించారు. స్టేషన్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఫ్లాట్‌ఫారంపై రైలు ఎక్కే వరకు ప్రత్యేక టైల్స్‌తో దారి వేశారు. ప్రయాణికులు వాహనాల పార్కింగ్‌, టిక్కెట్ల కొనుగోలు దగ్గర నుంచి స్టేషన్‌లో అన్ని రకాల దుకాణాలలో చేసే కొనుగోళ్లకు డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులకు ఏర్పాట్లు చేశారు. చేతి వృత్తులు చేసుకునే వారికి రైల్వే స్టేషన్‌లో ఒక దుకాణం కేటాయించారు. 1 ప్రొడక్ట్‌ 1 స్టేషన్‌ పేరిట ఇక్కడ జ్యూట్‌ బ్యాగ్‌లు తయారు చేసి అమ్మే దుకాణాన్ని ప్రవేశంలోనే నిర్వహిస్తున్నారు.

6వ ప్లాట్‌ఫాం ఏర్పాటు

రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పథకంలో 6వ ప్లాట్‌ఫాం నిర్మించనున్నారు. స్టేషన్‌లో ఆరు ట్రాక్‌లు ఉన్నప్పటికీ ఐదు ఫ్లాట్‌ఫాంలు మాత్రమే ఉన్నాయి. 6వ ట్రాక్‌ను గూడ్స్‌ రైళ్ల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. అక్కడ కూడా ఫ్లాట్‌ఫాం నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ…

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ అందిపుచ్చుకుంది. 1వ ప్లాట్‌ఫారంకు రెండు వైపులా చివరన ఉన్న సిగ్నల్‌ క్యాబిన్స్‌ను తొలగించనున్నారు. అధునాతన కంప్యూటరైజ్డ్‌ సిగ్నల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఈ పనులన్ని మరో మూడు నెలల్లో పూర్తి అవుతాయని స్టేషన్‌ మేనేజర్‌ వెంకటరమణ చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి…

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌

Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్‌ పొడిగింపు

High Court: ఏబీవీ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

For More AP News and Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights