తెనాలికి చెందిన పృథ్వీరాజ్ (27), దూరపు బంధువైన వెంకటలక్ష్మిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకట లక్ష్మీకి ఇది రెండో వివాహం.. కొద్ది కాలంపాటు దంపతులు తెనాలిలోనే ఇద్దరూ కలిసి జీవించారు. అయితే ఇక్కడ ఉపాధి దొరక్కపోవడంతో భార్యను తీసుకొని పృథ్వీరాజ్ బెంగుళూరు వెళ్లాడు. అక్కడ తాపి మేస్త్రీగా పనిచేశాడు. అక్కడ వీరికి పల్నాడు జిల్లా వెల్లటూరుకు చెందిన కోటేశ్వరరావు (23) పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో కోటేశ్వరావుతో వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అన్నా, చెల్లి అంటూ పిలుచుకుంటూ తమ ప్రవర్తనపై పృథ్వీరాజ్‌కు అనుమానం రాకుండా ఇరువురు జాగ్రత్త పడ్డారు. చివరకు వారి వ్యవహారం తెలియడంతో.. అక్కడ ఉండటం ఇష్టం లేని పృథ్వీరాజ్ తన భార్యను తీసుకొని తెనాలి వచ్చేశాడు.
తెనాలిలో ఉంటున్న సమయంలోనే కోటేశ్వరావుతో వెంకట లక్ష్మీ ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే వెంకటలక్ష్మి, కోటేశ్వరావు మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి పృథ్వీరాజ్ తండ్రి అంకమ రావుకు తెలిసిపోయింది. దీంతో ఇంట్లో ఘర్షణ జరిగి వెంకటలక్ష్మి బెంగుళూరు వెళ్లిపోయింది. అక్కడి నుంచి కోటేశ్వరరావుతో కలిసి నాలుగు నెలల కిందట వెల్లటూరు చేరింది. అక్కడ మూడు నెలల సహజీవనం తర్వాత కోటేశ్వరరావు మద్యం తాగి వచ్చి కొడుతూ ఉండడంతో.. భర్తకు ఫోన్ చేసి తాను మారిపోయానని తిరిగి తెనాలి వచ్చేస్తానని వేడుకుంది. దీంతో పృథ్వీరాజ్ ఆమెను తన ఇంటికి రానిచ్చాడు. కొద్దికాలం పాటు సక్రమంగా ఉన్న వెంకటలక్ష్మి తిరిగి కోటేశ్వరావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
అయితే కోటేశ్వరావు తెనాలి వచ్చి వెంకటలక్ష్మీని కలవడం సమస్యగా మారింది. దీంతో కోటేశ్వరావు పృథ్వీరాజ్‌పై కక్ష పెంచుకున్నాడు. అడ్డుతొ లగించుకోవాలని చూశాడు. ఈ విషయం తెలియని పృథ్వీరాజ్ అప్పుడప్పుడు కోటేశ్వరావుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. గత నెలలో తెనాలి వచ్చిన కోటేశ్వరావు పృథ్వీరాజ్ కు ఫోన్ చేసి మద్యం సేవిద్దామని పిలిచాడు. కోటేశ్వరావు మాట మాటలు నమ్మిన పృథ్వీరాజ్ అతనితో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన కోటేశ్వరావు మరో ఇద్దరి సాయంతో పృథ్వీరాజ్ పై దాడి చేసి చంపేశాడు. అయితే మద్యం కొనుగోలు చేసే సమయంలో స్థానికుడు వీరిని గుర్తించి.. పృథ్వీరాజ్ తండ్రికి అంకమరావు విషయం తెలియజేశాడు. దీంతో అంకమరావు తన కొడుకును చంపిన విషయంతో కోడలు ప్రమేయం ఉండి ఉంటుందన్న అనుమాన్ని వ్యక్తం చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కోటేశ్వరావు, వెంకటలక్ష్మీతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. భార్యపై ఎంతో ప్రేమను కలిగి ఉన్న పృథ్వీరాజ్ ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. చివరకు ఆమె వల్ల ఇలా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..