- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- స్పీకర్ నిర్ణయంపై కోర్టు అసంతృప్తి – అనర్హత కేసులో ఆలస్యం ఎందుకు?
- పార్టీ ఫిరాయింపులకు గడువు ఎంత? సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు

Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ధర్మాసనాల పూర్వపు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాల్లో ఎప్పటిలోగా తేల్చాలని స్పష్టంగా చెప్పలేదన్నారు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం ఉండాలి? పదవీకాలం పూర్తయ్యే వరకు వేచిచూడటమే రీజనబుల్ టైమ్ అవుతుందా? మొదటి ఫిర్యాదు నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. న్యాయపరంగా నిర్ణయం తీసుకోవడానికి తగిన గడువు ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, “పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం చేసుకుంటున్నారా?” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేషాద్రినాయుడు, ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం, అనర్హత పిటిషన్ విచారణార్హతను ముందుగా పరిశీలించాలని, అర్హత లేకుంటే పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని వారు వాదించారు. కానీ విచారణార్హత ఉంటే, స్పీకర్ నోటీసులు జారీ చేయాలని, వాటికి వారంలో సమాధానం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. సుందరం తన వాదనలో, రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం న్యాయసమీక్ష అధికారం కోర్టులకు ఉందని గుర్తు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై నోటీసులు ఇచ్చినా, వారు నాలుగు నెలల సమయం కోరారని తెలిపారు. ఇంగ్లాండ్‌లో స్పీకర్ రాజకీయాలకు దూరంగా ఉంటారని, కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేదని న్యాయస్థానానికి వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మనది “వైబ్రెంట్ డెమోక్రసీ” అని వ్యాఖ్యానించింది.
సందరం సుభాష్ దేశాయ్ కేసును ఉదహరిస్తూ, ఆ కేసులో కోర్టు నిర్ణీత గడువులోగా స్పీకర్‌ను నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత షెడ్యూల్ ఖరారు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా, లేదని ఆయన సమాధానం ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా, స్పీకర్ స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును ఆలస్యం చేసేందుకు డీలే ట్యాక్టిక్స్ ఉపయోగించవద్దని గట్టిగా హెచ్చరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
CM Chandrababu: కలెక్టర్లుకు సీఎం స్వీట్ వార్నింగ్..