- కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా
- 15 నెలల పాటు సభకు రాకున్నా కేసీఆర్ జీతభత్యాలు పొందుతున్నారు
- కేసీఆర్ వర్క్‌ఫ్రం హోమా? వర్క్ ఫ్రం ఫామ్‌హౌసా తెలియడం లేదు
- ఈ 15 నెలల్లో కేసీఆర్ తీసుకున్న జీతంభత్యం రూ.57.87 లక్షలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన విమర్శలను నిరసిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వారు 15 నిమిషాలుగా నిరసన తెలిపారు. సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “స్టేచర్ గురించి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి. గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది” అని పేర్కొన్నారు.
అంతేకాదు, “కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయన సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలి. 15 నెలలుగా సభకు రాకపోయినా, ఆయన రూ. 57.87 లక్షల జీతభత్యాలు తీసుకున్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ, సభకు హాజరుకాలేకపోవడం దారుణం” అని విమర్శించారు.
రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతూ, “రైతులకు రుణ మాఫీ చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించాం. ఒక్కో రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి, రైతు కూలీలకు రూ.12 వేల సాయం అందిస్తున్నాం. గతంలో కేసీఆర్ వరి పండించవద్దని అన్నా, మేము మాత్రం ప్రతి పంటను కొనుగోలు చేస్తాం. సన్నాలు (పరబోయిల్డ్ రైస్) పై రూ.500 బోనస్ ఇస్తున్నాం” అని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ, “ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ప్రజలే అంటున్నారు. గతంలో రైతుల ఖాతాల్లో 3-4 నెలల తర్వాత డబ్బులు జమ అయ్యేవి. కానీ ఇప్పుడు పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాం” అని తెలిపారు.
మహిళల అభివృద్ధిపై స్పందిస్తూ, “తెలంగాణ కోసం మహిళలు ముందుండి పోరాడారు. అలాంటి మహిళల సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.