- తెలంగాణలో మండుతున్న ఎండలు – ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి
- వడగాలుల తీవ్రత పెరుగుతోంది – వాతావరణ శాఖ హెచ్చరిక
- వానలు కురిసే సూచనలు – ఎప్పటికి ఊరట?

Weather Updates : తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారుజామునే ఎండలు మండి పడటంతో ప్రజలు దైనందిన పనులు చేసుకోవడానికే ఇబ్బందిపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వడగాలులతో ఉక్కిరిబిక్కిరి
తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఊపిరి పీల్చుకునేలా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ మంచి వార్త చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, రేపు , ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.