Telangana Farmers Points: భూ భారతి పైనే రైతుల ఆశలు

Written by RAJU

Published on:

  • పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో అమలు

  • ఏళ్లుగా ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయని అంచనాలు

  • పాస్‌ పుస్తకాలు, సాదా బైనామా కేసులే అధికం

  • సమస్యల వల్ల పథకాలకు దూరమవుతున్న రైతులు

  • నేలకొండపల్లి, వెంకటాపూర్‌లో తొలి రోజు జరగని రిజిస్ట్రేషన్లు

  • లింగంపేట, మద్దూర్‌లో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

కామారెడ్డి/ లింగంపేట, నేలకొండపల్లి, మహబూబ్‌నగర్‌, వెంకటాపూర్‌/ములుగు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత నాలుగు మండలాల్లో అమలు చేయనున్నారు. ఇందుకోసం నారాయణపేట జిల్లా మద్దూర్‌, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యమవుతుందని మదింపు వేసుకొని చట్టం ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత భూభారతి పోర్టల్‌లో కూడా వాటికి సంబంధించిన మాడ్యూల్స్‌ను సిద్ధం చేసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తారు. అయితే, భూభారతి పైలట్‌ ప్రాజెక్టు కింద తమ ప్రాంతాలను ఎంపిక చేయడంతో మద్దూర్‌, నేలకొండపల్లి, లింగంపేట, వెంకటాపూర్‌ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూసమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలాల్లో పాస్‌ పుస్తకాలు, సాదా బైనామా సమస్యలే అధికంగా ఉన్నాయి. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో భూముల వివరాలు, భూసమస్యల వివరాలు ఇలా ఉన్నాయి.

లింగంపేట మండలంలో వివాదంలో 1,663 ఖాతాలు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల పరిధిలో 41 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలో 10,098 సర్వేనంబర్లున్నాయి. వీటిలో 61,175 ఎకరాల్లో భూవిస్తీర్ణం ఉంది. ఇందులో 26,275 ఎకరాల సాగు భూమి ఉండగా.. 18,142 ఖాతాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. అటవీ భూములు 3044 ఎకరాల్లో ఉండగా.. వీటి పరిధిలో 278 సర్వే నంబర్లు ఉన్నాయి. అసైన్డ్‌ భూములు 12,722 ఎకరాల్లో ఉండగా.. వీటి పరిధిలో 10,199 సర్వే నంబర్లున్నాయి. లింగంపేట మండల పరిధిలో సంవత్సరాల తరబడి అటవీ, రెవెన్యూ భూముల హద్దులు తెలియక పలు పట్టా భూములకు పాసు పుస్తకాలు రావడం లేదు. మండలంలోని 1663 ఖాతాలు వివాదంలో ఉండడంతో వీటిని పార్ట్‌ బీలో చేర్చారు. ఈ ఖాతాలు ఎక్కువగా శెట్పల్లిసంగారెడ్డి, పోతాయిపల్లి, ముంబాజీపేట, కొండాపూర్‌, భవానిపేట, మోతె, లింగంపల్లి (ఖర్దు)గ్రామాల్లో ఉన్నాయి. పాసు పుస్తకాలు మంజూరు కాక చాలా మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. మండల కేంద్రంలోని ఎక్కువ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నట్టు రికార్డుల్లో నమోదై ఉన్నాయి. అటవీ, రెవెన్యూ భూముల హద్దులు తెలియక పలు గ్రామాల్లో ఏళ్లుగా అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి. లింగంపేట మండంలో భూభారతి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లను బుధవారం ప్రారంభిస్తున్నారు.

నేలకొండపల్లిలో 120 పెండింగ్‌ భూవివాదాలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంగళవారం నుంచి భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. కానీ, తొలి రోజు రిజిస్ట్రేషన్లు కాలేదు. తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ రైతులు రాలేదు. మండలంలో మొత్తం 45,584 ఎకరాల భూమి ఉండగా, అందులో 24,644 ఎకరాల భూమి సాగులో ఉంది. 35,334 మంది రైతులు ఉండగా, 20,900 పాస్‌పుస్తకాలు ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలో 3,417 సాదా బైనామాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండలంలో అసైన్డు, గ్రానైట్‌ భూముల వివాదాలతోపాటు రైతులకు సంబంధించి పాసు పుస్తకాల్లో ఎక్కువ భూమి, క్షేత్రస్థాయిలో తక్కువ భూమి ఉండడం, మరికొన్ని చోట్ల రైతుల ఆధీనంలో ఎక్కువ భూమి, పాసు పుస్తకాల్లో తక్కువ భూమి ఉండడం వంటి కేసులు ఉన్నాయి. మండలంలో 120 భూవివాదాలు నమోదై పరిష్కారం కాకుండా ఉన్నాయి.

మద్దూర్‌లో 30,621 ఎకరాల భూమి…

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా మొత్తం 30,621 ఎకరాల భూమి ఉంది. ఇందులో 30,473 ఎకరాలు సాగు భూమి. ఈ భూములకు సంబంధించి 47,706 మంది పట్టాదారులు ఉన్నారు. ఈ మండలంలో ఒకరి భూములు మరొకరికి వెళ్లడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉండటం, పట్టా ఒకరిపై ఉండి.. కాస్తులో మరొకరు ఉండటం, భాగపరిష్కారాల సమస్యలు, నిషేధిత భూముల జాబితాలో పడటం, వివాదం లేకున్నా పార్ట్‌- బిలో చేర్చడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి 17న గ్రామసభలను ప్రారంభించనున్నారు. భూభారతి పోర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వెంకటాపూర్‌లో పెండింగ్‌ సాదా బైనామాలు

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో భూభారతి పోర్టల్‌ను మంగళవారం ప్రారంభించారు. మొదటి రోజు రైతుల నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్లు అందలేదు. మండలంలో 25 గ్రామ పంచాయతీలు, పది రెవెన్యూ గ్రామాల్లో 13,533 మంది రైతులు ఉన్నారు. మండలంలోని 74,667 ఎకరాల భూమి భూభారతి చట్టం పరిధిలోకి రానుంది. గతంలో వెంకటాపూర్‌ మండలం నుంచి వచ్చిన సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించే గ్రామసభల షెడ్యూల్‌ను కలెక్టర్‌ బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date – Apr 16 , 2025 | 06:28 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights