తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 లక్షల 4 వేల 965 కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఈ పథకానికి బడ్జెట్‌లో 18 వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 24 వేల 439 కోట్ల రూపాయలు ప్రతిపాదించామన్నారు.
విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు భట్టి విక్రమార్క. వందకుపైగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 23 వేల 108 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దుతున్నామని తెలిపారు. బడ్జెట్‌లో ఇరిగేషన్ రంగానికి 23 వేల 370 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
ఇది కూడా చదవండి: Telangana Budget 2025: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి