Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌! – Telugu News | Telangana Budget 2025 26 to be presented in Assembly Today Rs 3.3 Lakh Crore Focus on Development and Welfare

Written by RAJU

Published on:

తెలంగాణ ప్రభుత్వం బుధవారం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న టాక్‌ వినిపిస్తోంది. మరీ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలను రేవంత్‌ సర్కార్ మెప్పిస్తుందా..? ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు..? ఆరు గ్యారంటీలకు ఎంత అనౌన్స్ చేస్తారు..? ఆదాయ అంచనాలు ఎలా ఉండబోతున్నాయ్..? ఇప్పుడివే అంశాలు బడ్జెట్‌పై ఆసక్తిని పెంచాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సుమారు 3.30లక్షల కోట్లతో భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్‌ ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది..!

మరీ ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులోభాగంగానే.. ప్రస్తుతం 2వేలుగా ఉన్న ఆసరా పెన్షన్‌ను కనీసం 3వేలకు పెంచాలని.. అందుకు ఏటా 3వేల నుంచి 4వేల కోట్ల రూపాయల ఖర్చు పెరనున్నట్లు అంచనా వేసింది. అలాగే.. మహాలక్ష్మీ పథకాన్ని.. దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్‌ యువవికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్‌ ఉంది. వీటన్నింటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్‌ సర్కార్.

కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో పాటు కేసీఆర్ కిట్‌ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉండటంతో.. సుమారు 3వేట కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్‌ సిటీకి కూడా నిధులు కేటాయించనుంది ప్రభుత్వం. ఈసారి పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక పోయినసారి బడ్జెట్‌ 2.91లక్షల కోట్లు కాగా ఈసారి 15శాతం మేర అంటే 3.30లక్షల కోట్లు దాటుతున్నట్లు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది 25వేల కోట్ల నుంచి 35వేల కోట్ల మేర పెరుగుతూ పోయింది. మొత్తంగా.. ఈసారి బడ్జెట్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఆరుగ్యారంటీలకు భారీ నిధులంటూ జరిగిన ప్రచారం బడ్జెట్‌పై అంచనాలు పెంచాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification